చుంచుపల్లి, మే 13 : చుంచుపల్లి మండలంలోని పెనగడప ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఎఫ్ఏక్యూ (ఫెయిర్ అవరేజ్ క్వాలిటీ) విధానం కారణంగా ధాన్యం కొనుగోళ్లు తీవ్రంగా ఆలస్యమవుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో తేమ శాతం 17 వరకు ఉంటే ధాన్యాన్ని కొనుగోలు చేసేవారని, ప్రస్తుతం మాత్రం ఎఫ్ఏక్యూ ప్రమాణాలు పూర్తిగా పాటించిన ధాన్యాన్నే కొనుగోలు చేస్తున్నారని రైతులు చెబుతున్నారు. వ్యవసాయ అధికారులు ధాన్యంలో తేమ శాతం, తాలు గింజలు, రంగు మారిన గింజలు, నాణ్యమైన గింజల శాతం తదితర అంశాలను పరీక్షించి ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉంటేనే కొనుగోలు చేపట్టాలని ఆదేశాలు ఉన్నాయని తెలిపారు. దీంతో ధాన్యం పరిశీలన ప్రక్రియ ఎక్కువ సమయం తీసుకుంటోందని రైతులు వాపోతున్నారు.
రోజుకు కేవలం నలుగురు రైతుల ధాన్యాన్నే పరిశీలించి కొనుగోలు చేస్తున్న పరిస్థితి నెలకొనడంతో మిగతా రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని తెలిపారు. కొనుగోలు ఆలస్యం కావడంతో ధాన్యం తడిసిపోవడం, నాణ్యత తగ్గిపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎఫ్ఏక్యూ ప్రమాణాలు సరిగా లేక ధాన్యం తిరస్కరణకు గురవుతుండడంతో రైతులు తీవ్ర నిరుత్సాహానికి లోనవుతున్నారని పేర్కొన్నారు. వెంటనే ఎఫ్ఏక్యూ విధానాన్ని రద్దు చేయాలని లేదా నిబంధనలను సడలించి పాత విధానంలోనే ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.