– అడుగు లోతు గోతులు… పైకి తేలిన ఇనుప రాడ్లు
– వాహనదారులకు ప్రాణసంకటం
బూర్గంపహాడ్, ఆగస్టు 24 : బూర్గంపహాడ్ మండల పరిధిలోని జింకలగూడెం వద్ద సీతారామ ప్రాజెక్టు కెనాల్‌పై నిర్మించిన వంతెన ప్రమాదకరంగా మారింది. వంతెనపై పెద్ద పెద్ద గోతులు, ఇనుపరాడ్లు పైకి తేలి ఉండటంతో వాహనదారులకు ఈ వంతెనపై ప్రయాణం ప్రాణసంకటంగా మారింది. జాతీయ రహదారి కావడంతో నిత్యం ఈ వంతెన మీదుగా వందలాది వాహనాలు ప్రయాణిస్తుంటాయి. ఈ వంతెనపై ఇప్పటికే పలుమార్లు గోతులు పడి ఇనుపరాడ్లు సైతం పైకి తేలి కనిపిస్తుండటంతో సంబంధిత అధికారులు మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. గతంలో ఒకటి రెండు సార్లు తాత్కాలిక మరమ్మతులు చేపట్టినా పదే పదే వంతెన గోతులమయంగా మారడంతో పాటు రాత్రి సమయాల్లో వాహనదారులకు ప్రమాదాన్ని కలిగించేలా ఉంది. సంబంధిత గుత్తేదారులు ఈ వంతెనపై రహదారికి మరమ్మతులు చేయకుండా నిర్లక్ష్యంగా వదిలేశారని వాహనదారులు, స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వంతెనపై గోతులకు శాశ్వత మరమ్మతులు చేపట్టాలని, వంతెన రహదారిపై తేలి కనిపిస్తున్న ఇనుపరాడ్ల స్థానంలో కొత్తగా కాంక్రీట్‌తో పనులు చేపట్టాలని స్థానికులు, వాహనదారులు ముక్తకంఠంతో కోరుతున్నారు.

జింకలగూడెంలో ప్రమాదకరంగా వంతెన