జూలూరుపాడు, మార్చి 28 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో అధికారులు నిర్వహించిన అంగన్వాడీ ఆయా బదిలీ స్థానికంగా మహిళల ఆందోళనకు దారితీసింది. జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామంలోని అంగన్వాడీ సెంటర్ -2లో ఆయా పోస్టు ఖాళీగా ఉండడంతో అధికారులు 2018లో దరఖాస్తులు ఆహ్వానించారు. జూలూరుపాడు గ్రామ పంచాయతీ కోయకాలనీకి చెందిన కురం వరలక్ష్మి అనే మహిళ తన ఓటరు గుర్తింపు కార్డును వెంగన్నపాలెం గ్రామానికి మార్చుకుని ఆయా పోస్టుకు దరఖాస్తు చేసుకుంది. సర్టిఫికెట్లు పరిశీలించిన అధికారులు ఆమెను ఆయాగా నియమిస్తూ నియామక పత్రం అందజేశారు. అప్పటినుండి ఆమె అక్కడే విధులు నిర్వహిస్తుంది. కాగా ఇటీవల సొంత గ్రామాలకు బదిలీలపై సిబ్బంది వెళ్లవచ్చని నోటిఫికేషన్ వెలువడింది. జూలూరుపాడులోని అంగన్వాడీ-2 సెంటర్లో ఆయా పోస్ట్ ఖాళీగా ఉండడంతో వరలక్ష్మి బదిలీపై ఇక్కడికి వచ్చేందుకు దరఖాస్తు చేసుకుంది. అధికారులు ఆమెను జూలూరుపాడు సెంటర్కి బదిలీ చేశారు.
అయితే జూలూరుపాడు పంచాయతీలోని కోయకాలనీకి చెందిన మహిళలు వేరే గ్రామానికి చెందిన మహిళను ఇక్కడకు ఎలా బదిలీ చేశారంటూ ప్రశ్నించారు. కోయకాలనీలోని అంగన్వాడీ కేంద్రంలో సెక్టార్ మీటింగ్ ఉందని తెలుసుకున్న గ్రామస్తులు కేంద్రానికి తాళం వేసి ఆందోళనకు దిగారు. స్థానికులకే ఆయా పోస్టు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విషయం తెలిసిన సీడీపీఓ సలోమి ఆందోళన చేస్తున్న మహిళల వద్దకు వచ్చి విషయాన్ని అడిగి తెలుసుకున్నారు.
కోయకాలనీకి చెందిన కురం వరలక్ష్మి వెంగన్నపాలెం గ్రామంలో ఉంటున్నట్లు సర్టిఫికెట్లు సృష్టించుకుని అక్కడ ఆయాగా విధుల్లో చేరారని, తిరిగి మళ్లీ స్థానికంగా ఉన్న సర్టిఫికెట్లను చూపెడుతూ బదిలీపై జూలూరుపాడు అంగన్వాడీకి ఆయాగా వచ్చినట్లు తెలిపారు. దాంతో స్థానికంగా ఉన్న వారికి అవకాశం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె బదిలీని నిలిపివేసి స్థానికంగా ఉన్న ఖాళీలు స్థానికులతోనే భర్తీ చేయాలని సీడీపీఓను కోరారు. ఈ విషయమై సీడీపీఓ స్పందిస్తూ పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి న్యాయం జరిగేలా చూస్తామని మహిళలకు హామీ ఇచ్చారు.
Julurupadu : అంగన్వాడీ ఆయా బదిలీపై వివాదం.. స్థానికులకే అవకాశం ఇవ్వాలని మహిళల ఆందోళన