– సింగరేణి సీఎండీకి ఎమ్మెల్యే కూనంనేని విజ్ఞప్తి
కొత్తగూడెం అర్బన్, సెప్టెంబర్ 30 : కొత్తగూడెం పట్టణం, పరిసర ప్రాంతాల అభివృద్ధి, ప్రజలకు కావాల్సిన మౌలిక వసతుల కల్పనకు సింగరేణి సంస్థ ద్వారా సహకరించాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాంను కలిసి కోరారు. మంగళవారం సంస్థ ప్రధాన కార్యాలయంలో సీఎండీని కలిసి పలు ప్రతిపాదనలు ఆయన ముందుంచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో ఆర్టీసీ బస్టాండ్ నూతన భవనాలకు సింగరేణి సంస్థ ద్వారా నిధులు మంజూరు చేయాలని, సీఎస్ఆర్ ఫండ్ సాధ్యమైనంత త్వరగా మంజూరు చేయాలని కోరారు. పోస్టాఫీసు సెంటర్ నుంచి డీఎస్పీ ఆఫీస్ మీదుగా హేమచంద్రాపురం వరకు ఉన్న రోడ్డు సింగరేణి సంస్థ భారీ వాహనాల రాకపోకల వల్ల శిథిలమైందని, దీన్ని సింగరేణి యాజమాన్యమే పునఃనిర్మించి ప్రజల అసౌకర్యాన్ని నివారించాలని కోరారు.
సింగరేణి కార్మిక వాడలు, ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు కావాల్సిన మౌలిక వసతుల కల్పనకు యాజమాన్యం చొరవ చూపాలన్నారు. రుద్రంపూర్, రామవరం తదితర ప్రాంతాల్లో మాజీ కార్మికులు నివసిస్తున్న క్వార్టర్లను వారికే స్వాధీనం చేసి విద్యుత్, త్రాగునీటి వసతి కల్పించాలని కోరారు. కార్మికవాడల్లో శిథిలమైన రోడ్లను నిర్మించాలని, నూతన భూగర్భ గనుల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరగా, తన ప్రతిపాదనలపై అధికారి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఎమ్మెల్యే వెంట సీపీఐ, ఏఐటీయూసీ నాయకులు ఎస్కే సాబీర్ పాషా, వంగ వెంకట్, రమణమూర్తి ఉన్నారు.