– రాత్రికి రాత్రే శిబిరం కూల్చివేసిన వైనం
– ఉదయం ఐటీసీ ఎదుట జేఏసీ నేతల భారీ నిరసన
బూర్గంపహాడ్, మార్చి 26 : 13వ వేతన ఒప్పందం పెండింగ్ సమస్యలు పరిష్కరించడంతో పాటు 14వ వేతన ఒప్పందం కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీతో కలిసి చేయాలనే డిమాండ్‌తో గత మూడు రోజుల క్రితం రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని చేపట్టారు. బుధవారం రాత్రి 9 గంటలు దాటాక ఐటీసీ ఒత్తిడితో పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది సహాయంతో దీక్షా శిబిరాన్ని కూల్చివేశారని, ఆయా కార్మిక సంఘాల జెండాలను చెల్లాచెదురుగా పడేశారని జేఏసీ సంఘాల నేతలు పేర్కొంటూ గురువారం ఉదయం ఐటీసీ ఎదుట భారీ ఎత్తున కాంట్రాక్టు కార్మికులతో కలిసి నిరసన చేపట్టారు. ఉదయం ఏ షిఫ్ట్, జనరల్ షిఫ్ట్ సమయాల్లో గంట పాటు కార్మికులు నిరసన తెలిపారు. అనంతరం జరిగిన గేటు మీటింగ్‌లో కాంట్రాక్టు కార్మిక జేఏసీ సంఘం కన్వీనర్ పాటి సోమిరెడ్డి, కో-కన్వీనర్లు సానికొమ్ము రామచంద్రారెడ్డి, బెల్లం నాగయ్య, యాకూబ్ పాషా కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు.
దీక్షా శిబిరం ఏర్పాటు చేసిన తర్వాత శ్రీరామ నవమి పర్వదినం నేపధ్యంలో ముఖ్యమంత్రి పర్యటన భద్రాచలంలో ఉండటంతో పోలీసు శాఖ కార్మిక జేఏసీకి శిబిరాన్ని తొలగించాలని చెప్పినా ఆ సమయంలో జేఏసీ నాయకులు మాత్రం తమ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పినప్పటికీ ఐటీసీ యాజమాన్య ఒత్తిడితో పోలీసులు తమ దీక్షా శిబిరాన్ని భగ్నం చేశారని ఆరోపించారు. తమ హక్కులు సాధించుకోవడానికి, సమస్యలు పరిష్కరించుకోవడానికి ఎంతటి న్యాయ పోరాటమైనా చేస్తామని, శ్రీరామ నవమి తర్వాత దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేసి ఐటీసీ యాజమాన్యంతో మరోసారి పోరాడేందుకు సంసిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కాంట్రాక్టు కార్మికులు సైతం జేఏసీకి కట్టుబడి ఉంటూ పోరాటంలో కలిసి రావడం జరుగుతుందని, కార్మికుల స్ఫూర్తితో సమస్యలు, హక్కులు సాధించుకునేందుకు ముందడుగు వేస్తామని యాజమాన్య పోకడను హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో జేఏసీ మెంబర్లు వర్ణగొండ వీరన్న, సింగారపు సతీష్, కదల వెంకటరెడ్డి, సుంకిరెడ్డి వెంకటరెడ్డి, మేకల శేషమ్మ, రామశెట్టి లక్ష్మి, వీరంరెడ్డి సీతారామిరెడ్డి, కాంట్రాక్టు కార్మికులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

కాంట్రాక్టు కార్మిక సంఘాల దీక్షా శిబిరం భగ్నం