పెనగడప, జూన్ 13 : పల్లె ప్రకృతి వనాల సంరక్షణ, అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల లక్ష్యాలకు విరుద్ధంగా చుంచుపల్లి మండలంలోని పెనగడప గ్రామంలో వీవో (విలేజ్ ఆర్గనైజేషన్) కార్యాలయ భవనం నిర్మాణం జరుగుతోందన్న ఆరోపణలు గ్రామ ప్రజల నుండి వ్యక్తమవుతున్నాయి. గ్రామానికి చెందిన మహిళా సంఘాల కార్యకలాపాల కోసం ప్రభుత్వం మంజూరు చేసిన వీవో కార్యాలయ భవనాన్ని గ్రామంలో నిర్మించాల్సి ఉండగా, గ్రామానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ములుగూడెం పల్లె ప్రకృతి వనంలో నిర్మిస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. సమాచారం ప్రకారం, పెనగడప వెన్నెల గ్రామ సమాఖ్య పరిధిలో మొత్తం 32 మహిళా సంఘాలు ఉన్నాయి. వీటి కార్యకలాపాల నిర్వహణ కోసం సుమారు రూ.10 లక్షల వ్యయంతో వీవో కార్యాలయ భవనం నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అయితే గ్రామ ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండే ప్రదేశంలో కాకుండా, పల్లె ప్రకృతి వనంలో పెద్ద ఎత్తున చెట్లను తొలగించి భవన నిర్మాణం చేపట్టడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
గత ప్రభుత్వ పాలనలో పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాల్లో చెట్లను పెంచి ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు చర్యలు తీసుకున్నారు. అలాంటి ప్రాంతంలోనే భవన నిర్మాణం కోసం చెట్లను నరికివేయడం ఎంతవరకు సమంజసమని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. చెట్ల తొలగింపునకు సంబంధించి అటవీ, పంచాయతీరాజ్ లేదా ఇతర సంబంధిత శాఖల నుంచి అనుమతులు పొందారా లేదా అన్న అంశంపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక గ్రామ సమాఖ్యకు చెందిన మహిళలు నెలకు కనీసం రెండు సార్లు సమావేశాలకు హాజరు కావాల్సి ఉంటుందని, గ్రామానికి దూరంగా ఉన్న ములుగూడెం వరకు వెళ్లడం ఇబ్బందికరంగా మారుతుందని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై గతంలో గ్రామపంచాయతీ సమావేశాల్లోనూ పెనగడప గ్రామంలోనే కార్యాలయాన్ని నిర్మించాలని తీర్మానాలు చేసినట్లు సమాచారం.
ప్రజలకు ఉపయోగపడే విధంగా గ్రామ కేంద్రంలో నిర్మించాల్సిన భవనాన్ని పల్లె ప్రకృతి వనంలో ఏర్పాటు చేయడం వల్ల పర్యావరణానికి నష్టం కలగడమే కాకుండా మహిళలకు ఇబ్బందులు తలెత్తే అవకాశముందని గ్రామస్థులు పేర్కొంటున్నారు. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు స్పందించి పూర్తి వివరాలు వెల్లడించాలని, అవసరమైతే నిర్మాణ స్థలాన్ని పునఃపరిశీలించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
పల్లె ప్రకృతి వనంలో చెట్ల నరికివేతకు అనుమతులు ఉన్నాయా? గ్రామానికి దూరంగా కార్యాలయం నిర్మించాల్సిన అవసరం ఏమిటి? అనే ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని గ్రామస్థులు అంటున్నారు.