కొత్తగూడెం అర్బన్, సెప్టెంబర్ 01 : తెలంగాణ వర ప్రాదాయని కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంపై కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచే దుష్ప్రచారం చేస్తోందని, మాజీ సీఎం కేసీఆర్‌ను బద్నాం చేయాలనే ఉద్దేశంతోనే కుట్రలకు పాల్పడిందని కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ పిలుపులో భాగంగా సోమవారం ప్రగతి మైదాన్‌లోని అమరవీరుల స్థూపం వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. కాళేశ్వరం నిర్మాణం చేపట్టకుండా ఆనాడు కాంగ్రెస్ పార్టీ అనేక కేసులను వేసిందని, ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసమే సీబీఐ, ఈడీ లను ఉపయోగించి కేసీఆర్ ను బద్నాం చేసి, కాళేశ్వరం ప్రాజెక్ట్ ను విఫలయత్నంగా చూపించి, ఆంధ్రా బనకచర్లకు లైన్ క్లియర్ చేసేందుకు మోదీ – రేవంత్ – చంద్రబాబు కలిసి పన్నిన దుష్ట పన్నాగమే ఇదని తేలిపోయిందన్నారు.
రైతుల కష్టాలు తీర్చేందుకు నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ కక్ష్య కట్టిందని, రైతుల ఉసురు పోసుకుంటున్న ఈ రేవంత్ రెడ్డి సర్కార్ కు నూకలు చెల్లిపోయాయని, రానున్న రోజుల్లో తగిన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీలో చర్చకు పిలిచి మాజీ మంత్రి హరీశ్‌రావు సమాధానాలను పదేపదే అడ్డుకున్నారని తెలిపారు. ఘోష్ కమిషన్ నివేదిక వాస్తవాలకు దూరంగా ఉందని, అది కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా సిద్ధం చేసుకున్న నివేదిక అని మండిపడ్డారు. తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడం కోసం తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించినట్లు తెలిపారు. తెలంగాణ కరువు ప్రాంతానికి నీరు అందించిన అపర భగీరథుడు కేసీఆర్ అన్నారు. అలాంటి అపర భగీరథుడిని అప్రతిష్ట పాలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ శతవిధాల ప్రయత్నం చేస్తుందని దుయ్యబట్టారు.
ప్రాజెక్టుపై కనీస పరిజ్ఞానం లేని మంత్రులు అడ్డదిడ్డమైన ప్రశ్నలు వేస్తూ.. సభా కాలాన్ని వృథా చేసి సభను తప్పుదోవ పట్టించారన్నారు. రూ. 87 వేల కోట్ల ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని అనడం వారి అజ్ఞానానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ప్రసాద్, తొగరు రాజశేఖర్, మునీర్, మాధవి, రామిళ్ల మధు, పూర్ణచందర్ నాయక్, హనుమంతరావు, పోతురాజు రవి, రాజమౌళి, సాంబశివరావు, బి కోటేశ్వరరావు, శ్రీనివాసరావు, షారుక్, రిజ్వాన్, యాకూబ్ పాషా, రెహమత్, ఆర్ శ్రీనివాస్, షణ్ముఖ సాయి, కాపు నవనీత్, హాసిఫ్, సమీర్ పాల్గొన్నారు.