– రైతులు యూరియా కోసం రోడ్డెక్కినా పట్టింపులేని ప్రభుత్వమిది
– వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే.. అందరి లెక్కలు తేలుస్తాం
– కేటీఆర్ పర్యటనను విజయవంతం చేద్దాం
– బీఆర్ఎస్ శ్రేణులకు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, తాతా మధుసూదనరావు పిలుపు
కొత్తగూడెం అర్బన్, ఆగస్టు 28 : ఎన్నికల్లో అలవి కానీ హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ, ఎన్నికలయ్యాక హామీలను తుంగలో తొక్కి రైతులు, కార్మికులు, ఉద్యోగులు అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తుందని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదనరావు అన్నారు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పార్టీ కార్యాలయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన మాజీ జడ్పీటీసీ, ఎంపీపీ, మండల అధ్యక్షులు, ముఖ్య నాయకుల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. పదేళ్ల కాలంలో మాజీ సీఎం కేసీఆర్ రైతులకు కన్నీళ్లు రాకుండా కాపాడుకున్నారని, అన్నీ వర్గాల ప్రజలు మెచ్చే విధంగా పరిపాలన చేసి కష్టాలను రూపుమాపారన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అంటేనే ఒకరేమో సెటిల్మెంట్లు, మరొకరు రియల్ ఎస్టేట్, ఇంకొకరు కమీషన్లతో దండుకుంటూ పాలనను గాలికొదిలేశారని ధ్వజమెత్తారు.
బీజేపీ, కాంగ్రెస్కు చెరో 8 మంది ఎంపీలను గెలిపిస్తే వారు ఏ ఒక్క రోజు కూడా రైతుల కష్టాలు, ప్రజల సమస్యలను పట్టించుకోకుండా కేంద్రం అడుగులకు మడుగులు ఒత్తుతున్నట్లు తెలిపారు. ఏ ఒక్క ఎంపీ కూడా తెలంగాణ ప్రజల కష్టాల గురించి ఒక్కనాడు కూడా నోరు మెదపలేదన్నారు. ప్రజలు ఛీ కొడుతున్నా ఇంకా ఈ ప్రభుత్వానికి బుద్ధి రావడం లేదని, ఇంకా వారు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను ఇబ్బందులు పెట్టాలని, జైలులో వేయాలని జపం చేస్తున్నారే తప్పా పాలనపై దృష్టి సారించడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులే పాలనపై పెదవి విరుస్తున్నారని ఎద్దేవా చేశారు. యూరియా కోసం రైతులు కష్టాలు పడుతుంటే ఏ ఒక్క మంత్రి, ఎమ్మెల్యే కూడా పీఏసీఎస్ కేంద్రాన్ని సందర్శించి రైతుల కష్టాలు వినలేని దౌర్భాగ్య స్థితిలో పాలకులు ఉన్నారని మండిపడ్డారు.
Kothagudem Urban : కాంగ్రెస్ పాలనంటే సెటిల్మెంట్లు, రియల్ ఎస్టేట్, కమీషన్లు : ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
స్థానిక సంస్థల ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ చేసిన సర్వేలో మెజారిటీ స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందనే ఎన్నికలను ప్రభుత్వం ఆలస్యం చేస్తోందన్నారు. కోర్టు మొట్టికాయలు వేయడంతో ఎన్నికల నిర్వహణకు సన్నద్ధమవుతున్నారని తెలిపారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఈ నెల 10, 11న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్యక్రమం ఉన్నందున నియోజకవర్గం వారీగా సమావేశాలు ఉంటాయని, ప్రతీ ఒక్కరూ తమ అభిప్రాయాలు స్వేచ్ఛగా చెప్పవచ్చన్నారు. రాష్ట్రమంతటా మెజారిటీ స్థానాలను, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మెజారిటీ జడ్పీటీసీలను గెలిచి జిల్లా పరిషత్ లను గెలవబోతున్నామని వారి సర్వేలో వెల్లడైందన్నారు. ఇటీవల కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారినా గ్రామ స్థాయిలో ఒక్క కార్యకర్త కూడా వారి వెంట వెళ్లకపోవడం బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్, కేటీఆర్ పైన ఉన్న నమ్మకానికి నిదర్శనమన్నారు.
రాబోయే ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి వారి రిజర్వేషన్ ప్రకారం టిక్కెట్లు కేటాయిస్తామని, ఎవరూ అధైర్య పడాల్సిన పని లేదన్నారు. స్థానిక సంస్థల్లో పోటీ చేసే ఆశావాహులంతా తమ బయోడేటాను పార్టీ కార్యాలయంలో ఇవ్వాలని సూచించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, బానోతు హరిప్రియ నాయక్, మెచ్చా వెంకటేశ్వరరావు, బీఆర్ఎస్ భద్రాచలం ఇన్చార్జి మానె రామకృష్ణ, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దిండిగల రాజేందర్, మున్సిపల్ మాజీ చైర్మన్ కాపు సీతాలక్ష్మీ, పార్టీ సీనియర్ నాయకులు రావులపల్లి రాంప్రసాద్, మండల అధ్యక్షులు, మాజీ జడ్పీటీసీలు, సర్పంచులు, వార్డు సభ్యులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడి పనిచేసి ఇటీవల అనారోగ్యంతో మరణించిన అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేటకు చెందిన తూతా నాగమణి, వైరా నియోజకవర్గానికి చెందిన జడల వెంకటేశ్వర్లు ఆత్మకు శాంతి కలగాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావం నుంచి వారు చేసిన కార్యక్రమాలు, ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తు చేసుకుని వారి సేవలను కొనియాడారు.
Kothagudem Urban : కాంగ్రెస్ పాలనంటే సెటిల్మెంట్లు, రియల్ ఎస్టేట్, కమీషన్లు : ఎంపీ వద్దిరాజు రవిచంద్ర