– ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్
ఇల్లెందు, ఫిబ్రవరి 06 : ఇల్లెందు మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా ఓటు అడిగేందుకు వచ్చే కాంగ్రెస్ నాయకులను ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీల గురించి నిలదీయాలని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి ఆర్ జె సి కృష్ణ ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం ఇల్లెందు మున్సిపాలిటీ పరిధిలో 1, 2, 23వ వార్డుల్లో గొల్ల గోపాలకృష్ణ, కటకం పద్మావతి, కే.సారాయిలతో కలిసి వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీఆర్ఎస్, కేసీఆర్ పాలనలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి సంక్షేమ పథకాలతో ప్రజల అభివృద్ధికి కృషి చేశారన్నారు. కానీ కాంగ్రెస్ మాయమాటలు చెప్పి రైతుబంధు రూ.16 వేలు, ఫించన్ రూ.4 వేలు, కల్యాణ లక్ష్మి పథకం ద్వారా నగదు, తులం బంగారం, మహిళలకు నెలకు రూ.2,500 ఇలా అలిమి కానీ హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని దుయ్యబట్టారు.

‘కాంగ్రెస్ నాయకులను ఆరు గ్యారెంటీలపై నిలదీయాలి’
కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలు పూర్తయినా ఇచ్చిన 6 గ్యారంటీలో ఒకటి కూడా సరిగ్గా అమలు చేయలేదని, ఓటు కోసం ఇంటికొచ్చిన కాంగ్రెస్ నాయకులను ఆరు గ్యారంటీల గురించి నిలదీయాలని ప్రజలకు సూచించారు. ఇల్లెందు మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ వైపు కబ్జాలు, దందాలు ఉన్నాయని, బీఆర్ఎస్ వైపు అభివృద్ధి, సంక్షేమం ఉందని ప్రజలు ఎటువైపు ఉంటారో ఆలోచించుకోవాలని కోరారు. ఇల్లెందులో కొత్త బస్టాండ్‌కు సమీపాన ఉన్న స్మశాన వాటికను కాంగ్రెస్ నాయకులు కబ్జా చేసుకుని పంచుకున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆమె ప్రజలకు గుర్తు చేశారు. ఇల్లెందు అభివృద్ధి బీఆర్ఎస్ హయంలో జరిగిందని, రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి చెందలేదన్నారు. మళ్లీ అభివృద్ధి జరగాలంటే బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బానోత్ హరి సింగ్ నాయక్, లక్కినేని సురేందర్ రావు, భూక్య దళ్ సింగ్ నాయక్, శీలం రమేష్, సీతారాం నాయక్, స్థానిక బీఆర్ఎస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

‘కాంగ్రెస్ నాయకులను ఆరు గ్యారెంటీలపై నిలదీయాలి’