ఇల్లెందు, మార్చి 18 : హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో ఇల్లెందు నియోజకవర్గ బీఆర్ఎస్ యువజన నాయకులను ఇల్లెందు పోలీసులు మంగళవారం ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి భారత రాష్ట్ర సమితి పిలుపునివ్వగా స్థానిక నాయకులు హైదరాబాద్‌కు బయల్దేరారు.
కాగా ఇల్లెందు పోలీసులు బీఆర్ఎస్ ఇల్లందు పట్టణ యువజన నాయకులు గిన్నారపు రాజేశ్, సత్తాల హరికృష్ణ, చాంద్ పాషాను ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. యువజన నాయకుల అక్రమ అరెస్ట్‌ను బీఆర్ఎస్ నాయకులు ఖండించి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి విషయానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్టు చేసి భయభ్రాంతులకు గురి చేస్తుందని పేర్కొన్నారు.