పాల్వంచ, ఏప్రిల్ 23 : మోసపూరిత మాటలతో, 420 హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ 15 నెలల పాలనలో ప్రజలకు చేసిన మేలు శూన్యమని మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు అన్నారు. పాత పాల్వంచలోని స్వగృహంలో బుధవారం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు కొత్తగూడెం నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ రజతోత్సవ పండుగ వందేళ్లు గుర్తుండేలా జరగనున్నదనీ, ఈ సభ ద్వారా కాంగ్రెస్ పార్టీ దిమ్మ తిరిగిపోతుందన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే కాంగ్రెస్ పార్టీ కనుమరుగు కావడం ఖాయమన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలను ఒక స్వర్ణ యుగంగా ప్రజలు అభివర్ణిస్తున్నట్లు ఆయన తెలిపారు. పచ్చి అబద్దాలతో అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో వనమా రాఘవేందర్ రావు, పార్టీ సీనియర్ నాయకులు కిలారు నాగేశ్వరరావు, పాల్వంచ సొసైటీ ఉపాధ్యక్షుడు కాంపెల్లి కనికేశ్, మాజీ ఎంపీపీ మడివి సరస్వతి, నాయకులు దాసరి నాగేశ్వరరావు, మండలాధ్యక్షుడు పూసల విశ్వనాథం, మల్లెల శ్రీరామ్ మూర్తి, కొత్వాల సత్యం, భూక్య చందునాయక్, వీరు నాయక్, తెలంగాణ సురేశ్, వీర్రాజు, చందు, అన్నం ప్రభాకర్, మాజీ ఎంపీటీసీ వీరన్న, కొండలరావు, నరేశ్, మాజీ సర్పంచ్ అర్జున్ రావు, రాంబాబు, విద్యార్థి నాయకుడు దుర్గాప్రసాద్, కుంపటి శివ, నారకట్ల రాజశేఖర్, కంచర్ల రామారావు, వాసమల్ల గౌతమ్ పాల్గొన్నారు.