జూలూరుపాడు, జూన్ 06 : ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కి, ప్రజాపాలన అంటూ ఎగవేతల పాలన కొన సాగిస్తుందని బీఆర్ఎస్ పార్టీ వైరా నియోజకవర్గ సీనియర్ నాయకుడు లకావత్ గిరిబాబు అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో అనేక హామీలిచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందని విమర్శించారు. రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫి చేస్తామని ఆశ చూపి, ఎన్నో కొర్రీలు పెట్టి నేటి వరకు ఇచ్చిన హామీ మేరకు రుణమాఫి చేయలేదన్నారు. అలాగే పంట పెట్టుబడికి రైతు భరోసా కింద ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని చెప్పి ఒక ఏడాది రైతు భరోసా ఎగ్గొట్టి ఇప్పుడు ఎకరాకు రూ.12 వేలు మాత్రమే ఇస్తామని చావు కబురు చల్లగా చెప్పి దానిని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకుండా ఎగవేసిందన్నారు.
4 వేలు పింఛన్ ఇస్తామని, మహిళలకు 2,500 ఆర్థిక సహాయం అందిస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తామని, కల్యాణ లక్ష్మి చెక్కులతో పాటు తులం బంగారం ఇస్తామని ఇలా అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక అన్నింటినీ ఎగవేసిందని దుయ్యబట్టారు. ఈ ఎగవేత కాంగ్రెస్ ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా పోరాటానికి ప్రజలు సిద్ధం కావాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని ఆయన కోరారు.