– మాజీ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత
– బూర్గంపహాడ్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణుల నిరసన ప్రదర్శన
బూర్గంపహాడ్, సెప్టెంబరు 03 : రాష్ట్రంలో వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనలో అన్నీ వైఫల్యాలే చోటుచేసుకున్నాయని బీఆర్ఎస్ నాయకురాలు, మాజీ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత అన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు గురువారం బూర్గంపహాడ్‌లో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ నిరసనలో మాజీ జడ్పీటీసీ మాట్లాడుతూ.. వ్యవసాయ విధ్వంసంపై నీటిపారుదల రంగం, విద్యుత్, యూరియా, రైతు బీమా తదితర అంశాల్లో అన్నదాతలను ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేసిందన్నారు. మరోపక్క 420 హామీలతో ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రగల్భాలు పలికి అధికారంలోకి వచ్చాక ఆ హామీలను విస్మరించి ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు.
రైతుబంధు రూ.15వేలు, గిట్టుబాటు ధర, సన్న వడ్లకు రూ.500 బోనస్, కౌలు రైతులకు రైతుబంధు రూ.15 వేలు ఇస్తానని అన్నదాతలను మోసం చేసిందని, రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రూ.12 వేలు ఏడాదికి ఇస్తానని ఇచ్చిన హామీ జాడలేదన్నారు. తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు, రైతులకు ఇచ్చిన హామీలు, ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని, లేనిపక్షంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, పట్టణ అధ్యక్షుడు కొనకంచి శ్రీనివాసరావు, మండల నాయకులు మేడగం లక్ష్మినారాయణరెడ్డి, సానికొమ్ము శంకర్‌రెడ్డి, దారం కృష్ణారెడ్డి, గోనెల నాని, పూర్ణ, కైపు ఖగేందర్రెడ్డి, తుపాకుల రవికుమార్, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఉప సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ అనుబంధ సంఘాల నాయకులు, మహిళా నాయకులు పాల్గొన్నారు.

‘వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనలో అన్నీ వైఫల్యాలే’