– కష్టకాలంలో కాపాడిన తమపై కేసులా?
– అధికారంలోకి రాగానే వలస వచ్చిన వారికి పదవులా?
- జూలూరుపాడు కాంగ్రెస్లో నివురు గప్పిన నిప్పులా అంతర్గత పోరు
జూలూరుపాడు, మే 27 : తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవుల పంపకాలు, కమిటీల నియామకాలు ఇప్పుడు స్థానిక రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జెండా మోసి, కేసుల పాలైన సీనియర్లను కాదని వలస వచ్చిన నాయకులకు పెద్దపీట వేస్తున్నారంటూ జూలూరుపాడు మండలానికి చెందిన సీనియర్ దళిత కాంగ్రెస్ నాయకుడు మంద బాబు తీవ్ర ఆవేదన, అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. స్థానిక నియోజకవర్గ, మండల కాంగ్రెస్ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలను ఎండగట్టారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ‘దళితబంధు’ పథకం ద్వారా ఆర్థికంగా లబ్ధి పొందిన కొందరు దళిత నాయకులు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కండువాలు కప్పుకుని ఇక్కడ చక్రం తిప్పుతున్నారని మంద బాబు ఆరోపించారు.
పార్టీ అధికారం కోసం అహర్నిశలు శ్రమించిన తమలాంటి కల్మషం లేని సీనియర్ దళిత నాయకులకు పార్టీలో కనీస గౌరవం దక్కడం లేదని వాపోయారు. ఏనాడూ పార్టీ సిద్ధాంతాల కోసం పని చేయని వారికి, కేవలం స్వలాభం కోసం వలస వచ్చిన వారికి ఎస్సీ సెల్ వంటి కీలక పదవులు అప్పగించడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, తీవ్ర కష్టకాలంలో ఉన్నప్పుడు ఎలాంటి ఇత్తులు జిత్తులు తెలియకుండా కేవలం కాంగ్రెస్ సిద్ధాంతాన్ని నమ్మి పనిచేశాను. జేబులో రూపాయి లేకపోయినా, పస్తులు ఉంటూ పార్టీ ఆదేశాల ప్రకారం ధర్నాలు, రాస్తారోకోల్లో పాల్గొన్నాను. ఫలితంగా నాపై కేసులు నమోదై, నేటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నాను. బి-ఫారం తెచ్చుకున్న అభ్యర్థి గెలుపు కోసం అహర్నిశలు తిరిగిన నాలాంటి వాడికి దక్కిన గౌరవం సున్నా.
కానీ, నాడు కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూ పైస్థాయి నాయకుల వద్ద మన్ననలు పొందుతూ, ‘పదవులు ఇస్తేనే పని చేస్తాం’ అంటూ పబ్బం గడుపుకున్న కొందరు యువ నాయకులు, వంకర బుద్ధులతో వచ్చిన వలస నేతలు ఈరోజు పదవులు అనుభవిస్తున్నారు. ఇది సీనియర్ దళితులను అవమానపరచడమే” అని మంద బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న ఎస్సీ సెల్ కమిటీల నియామకాల్లో అలాగే రాబోయే నామినేటెడ్ పదవుల కేటాయింపుల్లో నాలాంటి సీనియర్ దళిత కాంగ్రెస్ నాయకులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కష్టపడిన వారికి కాకుండా, కేవలం అవకాశవాదులకే పదవులు ఇచ్చుకుంటూ పోతే క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన అధిష్ఠానాన్ని హెచ్చరించారు. ఇప్పటికైనా పార్టీ పెద్దలు జోక్యం చేసుకుని సీనియర్ కార్యకర్తలకు, నాయకులకు న్యాయం చేయాలని ఆయన కోరారు.