జూలూరుపాడు, మార్చి 24 : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో రూ.2 లక్షల వరకు ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి అధికారం చేపట్టిన తర్వాత రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేసిందని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేశ్ అన్నారు. జూలూరుపాడు మండల కేంద్రంలో సోమవారం జరిగిన ఆ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మొత్తం 65 లక్షల మంది రైతులు ఉంటే 20 లక్షల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేసి రైతులందరికి రుణమాఫీ చేసినట్టుగా ప్రభుత్వం పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు.
రూ.2 లక్షల పైన ఉన్న రైతులందరూ కూడా పైన ఉన్న డబ్బులు కట్టండి వెంటనే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి , మంత్రులు పదే పదే చెప్పడంతో వారి మాటలు నమ్మి చాలా మంది రైతులు రెండు లక్షల పైనున్న డబ్బులు బ్యాంకుల్లో కట్టి మరింత ఆర్థికంగా నష్టపోయారన్నారు. పహాని నకల్ తో రుణాలు తీసుకున్న రైతులకు మాఫీ కాలేదు, రైతు భరోసా వానాకాలంలో ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు, రబీలో ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు రెండు మూడు ఎకరాలకు మాత్రమే డబ్బులు రైతుల ఖాతాలో వేసి ప్రభుత్వం చేతులు దులుపుకుందని తెలిపారు.
వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు ఇస్తామని చెప్పి కొద్దిమందికి మాత్రమే రూ.6 వేలు ఇచ్చారని, పంటలన్నింటికీ కూడా బోనస్ 500 రూపాయలు ఇస్తానని చెప్పి సన్న వడ్లకు మాత్రమే ఇస్తున్నారని విమర్శించారు. పంటల బీమా, రైతు బీమా అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ రైతులను, వ్యవసాయ కూలీలను, నిరుద్యోగులను, మహిళలను, వృద్ధులను, దివ్యాంగులను మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకుడు నున్నా రమేశ్, మండల అధ్యక్షుడు సిరిపురపు ప్రసాద్, తెల్లం నరసింహారావు, భూక్య రమేశ్, భూక్య రవి, నిమ్మటూరి రామారావు, సిరిపురపు గోపాలరావు, నర్వనేని కృష్ణ పాల్గొన్నారు.