భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 18 : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆరవ జాతీయ జల అవార్డులు అలాగే జల్ సంచయ్-జన్ భగీదారి అవార్డులను ప్రదానం చేశారు. జల్ సంచయ్ జన్ భగీదారి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు సౌత్ జోన్ క్యాటగిరి మూడులో భద్రాద్రి కొత్తగూడం జిల్లా ఎంపికైంది. నేడు జరిగిన అవార్డుల ప్రదానం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. తెలంగాణలో 33 జిల్లాల్లో ఆరు జిల్లాలను ఎంపిక చేయగా అందులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కూడా ఒకటి. అవార్డుతో పాటు రూ.25 లక్షల నగదు ఇప్పటికే ఖాతాలోకి పంపారు.
గత మే నెల 1వ తేదీన ప్రారంభించిన జలశక్తి పనులు మొత్తంగా కలెక్టర్ తనే స్వయంగా ఇంకుడు గుంతలు, పారంపాండ్లు, వాటర్ కన్జర్వేషన్ పనులు ఈ ఏడాది మే నెల 31 వరకు 29,103 పనులు చేశారు. జిల్లా వ్యాప్తంగా 23 మండలాల పరిధిలో అన్ని శాఖల అధికారుల భాగస్వామ్యంతో చకచకా పనులు చేయడంతో భద్రాద్రికి ఈ అవార్డు దక్కింది. డీఆర్డీఓ విద్యాచందన కూడా ఈ అవార్డు స్వీకరణలో పాల్గొన్నారు. ఏడాదిలో మూడు సార్లు అవార్డు దక్కించుకుని జిల్లాకి పేరు తెచ్చిపెట్టిన కలెక్టర్కు అధికారులు, ప్రజలు అభినందనలు తెలుపుతున్నారు.