పాల్వంచ, ఏప్రిల్ 13 : పాల్వంచలోని బోల్లారిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ అంకిత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణను ప్రత్యక్షంగా పరిశీలించి, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలపై సమగ్రంగా ఆరా తీశారు. తనిఖీలో భాగంగా పరీక్ష హాళ్లలో విద్యార్థులు కూర్చునే విధానం, ప్రశాంత వాతావరణం, తగిన వెలుతురు, తాగునీటి సదుపాయం, విద్యుత్, ఫ్యాన్లు, శుభ్రత వంటి మౌలిక వసతులను పరిశీలించారు. ప్రతి విద్యార్థికి సరైన దూరం పాటిస్తూ కూర్చునేలా చర్యలు తీసుకోవాలని, పరీక్ష సమయంలో ఎటువంటి అంతరాయాలు లేకుండా అన్ని ఏర్పాట్లు సమర్థంగా ఉండాలని అధికారులకు సూచించారు. పరీక్షా కేంద్రంలో ప్రశ్నపత్రాల పంపిణీ, సమాధాన పత్రాల సేకరణ, భద్రపరిచే విధానం వంటి అంశాలను పరిశీలించి, పరీక్షల నిర్వహణలో పూర్తి పారదర్శకత, నిష్పక్షపాతత పాటించాలని అధికారులను ఆదేశించారు.
ఎటువంటి అవకతవకలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ ఉండాలని, మాల్ ప్రాక్టీస్‌కు అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ఇన్విజిలేటర్లు, సిబ్బంది తమ బాధ్యతలను నిబద్ధతతో నిర్వహించాలని, విద్యార్థులకు అవసరమైన మార్గదర్శకత్వం అందిస్తూ సహాయకరంగా వ్యవహరించాలని తెలిపారు. ప్రత్యేకంగా విద్యార్థులు ఒత్తిడికి లోనవకుండా, ఆత్మవిశ్వాసంతో ప్రశాంతంగా పరీక్షలు రాసేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని సూచించారు. కలెక్టర్ వెంట ప్రధానోపాధ్యాయురాలు మంగమ్మ, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు.