రుద్రంపూర్, ఏప్రిల్ 14 : కొత్తగూడెం జిల్లా హనుమాన్ బస్తీకి చెందిన ఈ.సాత్విక ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో స్టేట్ ర్యాంక్ సాధించి ప్రతిభ కనబరించింది. మున్సిపల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఈ.సంతోష్ బాబు కుమార్తె అయిన సాత్విక ఈ విజయంతో విద్యార్థులందరికీ ఆదర్శంగా నిలిచింది. గురుకుల విద్యాసంస్థలో ఇంటర్ విద్యను అభ్యసించిన సాత్విక బైపీసీ విభాగంలో 1,000 మార్కులకు 991 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ర్యాంక్ దక్కించుకుంది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ సాత్వికను అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ విద్యా సంస్థల్లో అత్యున్నతమైన ప్రతిభ గల ఉపాధ్యాయులు, సిబ్బంది ఉన్నారనడానికి సాత్వికే సాధించిన విజయమే నిదర్శనమన్నారు.
ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులతో సమానంగా, ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థులు కూడా ఎక్కడా తగ్గరని సాత్విక నిరూపించిందన్నారు. భవిష్యత్‌లో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆమెకు ఆశీర్వాదాలు అందించారు. ఈ సందర్భంగా సాత్విక తండ్రి ఈ.సంతోష్ బాబు, సామాజిక సేవకుడిగా ప్రాణదార ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా, జిల్లా కలెక్టర్ అంకిత్‌కు పూల మొక్క అందించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాత్వికతో పాటు ఎన్.శ్రీకాంత్ పాల్గొన్నారు.