– పర్యావరణ పరిరక్షణలో ఐటీసీ, భాగస్వామ్య సంస్థల కృషి అభినందనీయం
– భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీశాఖ అధికారి కృష్ణగౌడ్
బూర్గంపహాడ్, జూన్ 11 : భవిష్యత్ తరాల కోసం సహజ వనరులను కాపాడుకోవడంతో పాటు పచ్చదనాన్ని పెంపొందించుకోవడం, వన్యప్రాణుల ఆవాసాలను రక్షించడం కోసం సమిష్టి కృషి అవసరమని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీ శాఖాధికారి కృష్ణగౌడ్ అన్నారు. గురువారం బూర్గంపహాడ్ మండల పరిధిలోని ఐటీసీ కర్మాగారంలో ఐటీసీ మిషన్ సునెరెకల్ ఆధ్వర్యంలో ఆటవీశాఖ సహకారంతో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అటవీశాఖ అధికారి కృష్ణగౌడ్తో పాటు అటవీ విభాగ అధికారి ఆర్.బాబు, ఐటీసీ యూనిట్ హెడ్ శైలేంద్రసింగ్, ఐటీసీ హెచ్ఎర్ జీఎం శ్యామి కిరణ్, డీజీఎం చెంగల్రావు, మిషన్ సునిరేకల్ ప్రతినిధులు గీత ప్రవల్లిక, కుంటల్ సర్కార్లు పాల్గొని మాట్లాడారు. అటవీ వైవిధ్యీకరణ, పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిద్య సంరక్షణ ప్రాముఖ్యతను వివరించారు.
ఐటీసీ సునిరేకల్ ప్రతినిధులు అమలుచేసిన, చేస్తున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రదర్శించగా వాటిని అటవీశాఖ జిల్లా అధికారి తిలకించి అభినందించారు. సామాజిక అటవీకరణ, సుస్ధిర వ్యవసాయపద్ధతులు, అటవీ, సామూహిక భూముల జీవ వైవిధ్య పరిరక్షణ, రైతుల జీవనోపాధి అభివృద్ధి, ప్రాథమిక విద్య, మహిళా సాధికారిత, ఆరోగ్యం, పారిశుధ్యం, ఘనవ్యర్ధాల నిర్వహణ, గ్రామీణ యువతకు వృత్తి నైపుణ్య శిక్షణ అంశాలను క్లుప్తంగా ప్రదర్శన రూపంలో వివరించారు. పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం మరింత పెంచాలని, ఇలాంటి కార్యక్రమాలు ప్రజల్లో అవగాహన కల్పించి అమలుచేయడం అభినందనీయమని ఐటీసీని అభినందించారు. అనంతరం జిల్లా అటవీశాఖ అధికారి ఐటీసీ ఉన్నతాధికారులతో కలిసి ఐటీసీ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఐటీసీ మేనేజర్లు, సునిరేకల్ ప్రతినిధులు, అటవీశాఖ రేంజ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

‘సహజ వనరుల సంరక్షణకు సమిష్టి కృషి అవసరం’