చండ్రుగొండ, మే 20 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం ముస్లిం మైనార్టీలు గ్రామస్తులతో కలిసి బొగ్గు టిప్పర్లను అడ్డుకున్నారు. సత్తుపల్లి నుండి కొత్తగూడెంకు నిత్యం వందలాది బొగ్గు టిప్పర్లు అతివేగంగా ప్రయాణించడం వల్ల నిత్యం మనుషుల ప్రాణాలు పోతున్నాయని గ్రామస్తులు ఆరోపించారు. అన్నపరెడ్డిపల్లి మండలంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చండ్రుగొండ గ్రామానికి చెందిన వృద్ధుడు మౌలానా (70) బొగ్గు టిప్పర్ వల్ల మృతి చెందడంతో ఆగ్రహించిన గ్రామస్తులు, ముస్లిం మైనార్టీలు టిప్పర్లను అడ్డుకుని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆర్టీఏ అధికారులు, పోలీసులు మామూళ్లకు అలవాటు పడి అతివేగంగా వస్తున్న బొగ్గు టిప్పర్లను, అధిక లోడుతో కనీసం పట్టాలు, టార్ బార్లు వేసుకోకుండా బొగ్గు రోడ్డుపై పడుతున్నా కనీసం తనిఖీలు చేయడం లేదని విమర్శించారు. అధికారుల అవినీతి వల్ల ప్రజల ప్రాణాలు పోతున్నాయని ఆరోపించారు. నిబంధనలను పట్టించుకోని ఆర్టీఏ అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంఘటనా స్థలానికి ఎస్ఐ శివరామకృష్ణ చేరుకుని ఆందోళనకాలను సముదాయించడంతో ఆందోళన విరమించారు.
Chandrugonda : చండ్రుగొండలో బొగ్గు టిప్పర్ల అడ్డగింత