రామవరం, ఆగస్టు 26 : ఆగి ఉన్న ప్యాసింజర్ ఆటోను బొగ్గు లోడుతో వెళ్తున్న టిప్పర్ బలంగా ఢీకొన్న దుర్ఘటనలో ఆటో డ్రైవర్ మృతిచెందాడు. ఈ సంఘటన కొత్తగూడెం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. సత్తుపల్లి నుంచి కొత్తగూడెం వైపు వస్తున్న బొగ్గు టిప్పర్ అంబేద్కర్ నగర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల అంబేద్కర్ నగర్ స్టేజి వద్ద ఆటో అద్దం తుడుచుకుంటూ ఉండగా వెనుక నుండి వచ్చి ఢీకొంది. దీంతో ఆటో డ్రైవర్ మంగళగిరి శేషగిరి (38) కి తీవ్రగాయాలు అవగా వైద్య చికిత్స కోసం కొత్తగూడెం సర్వజన ఆస్పత్రికి తరలించారు.
ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వైద్యుల సలహా మేరకు మెరుగైన వైద్యం కోసం ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం ఉదయం మృతి చెందాడు. టిప్పర్ డ్రైవర్ పరారయ్యాడు. సమాచారం తెలుసుకున్న కొత్తగూడెం టూ టౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఇంతటి విషాదంలోనూ శేషగిరి నేత్రాలను కుటుంబ సభ్యులు దానం చేసి మానవతను చాటారు.