ఇల్లెందు, మే 31 : టీచర్ల సర్దుబాటు ఉత్తర్వులను వెంటనే నిలుపుదల చేయాలని, సర్దుబాటు పేరుతో ప్రాథమిక పాఠశాలల మూసివేత సరికాదని టీపీటీఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు గుగులోత్ హరిలాల్ నాయక్ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. బడిబాటలో విద్యార్థుల నమోదు పెంచాలని ఒకవైపు చెబుతూనే మరొక వైపు విద్యాశాఖ శుక్రవారం నాడు విడుదల చేసిన 1267/SER-III_1/2024 ఉత్తర్వుల ప్రకారం పాఠశాలల పునః ప్రారంభానికి ముందే ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఉత్తర్వులు పాఠశాలల మూసివేతకు దారి తీస్తాయని, వెంటనే ఉత్తర్వులను నిలుపుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ ఉత్తర్వుల ప్రకారం ప్రాథమిక పాఠశాలలో 10 లోపు విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు, 60 లోపు విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు, 90 లోపు విద్యార్థులకు ముగ్గురు ఉపాధ్యాయులు ఉండాలని నిబంధన విధించారు. ఇట్లాంటి అసంబద్ధమైన నిబంధన వల్ల తల్లిదండ్రులు ఏ నమ్మకంతో తమ పిల్లలను ప్రాథమిక పాఠశాలలో నమోదు చేస్తారో ప్రభుత్వమే ఆలోచించాలన్నారు. బడిబాట అనంతరం జూన్ 30వ తేదీ నాటికి నమోదైన విద్యార్థుల సంఖ్యతో సర్దుబాటు చేసేలా ఉత్తర్వులు సరిచేయాలని, ప్రాథమిక పాఠశాలలో కనీసం 20 లోపు పిల్లలకు ఇద్దరు ఉపాధ్యాయులు, 40 లోపు పిల్లల వరకు ముగ్గురు ఉపాధ్యాయులు, 60 మంది పిల్లల వరకు నలుగురు ఉపాధ్యాయులు, 60 మంది పైగా ఉన్న పాఠశాలలకు ఐదుగురు ఉపాధ్యాయులు ఉండేలా ఉత్తర్వులు సవరణ చేయాలని డిమాండ్ చేశారు.