బూర్గంపహాడ్, జూన్ 08 : బూర్గంపహాడ్ మండలంలో మృగశిర కార్తె సందర్భంగా చేపల కొనుగోలుకు భలే గిరాకీ లభించింది. మార్కెట్లో ఎక్కడ చూసినా చేపలు కొనుగోలు చేసేందుకు జనం పెద్దసంఖ్యలో క్యూ కట్టారు. ప్రతి ఏడాది మృగశిర కార్తె ప్రారంభం నాడు చేపలు తినడం తెలంగాణ ప్రజలకు సాంప్రదాయంగా వస్తుంది. మృగశిర కార్తె సమయంలో చేపలు తింటే ఉబ్బసం వంటి వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చని నానుడి ఉండడంతో ప్రజలు చేపల కోసం ఎగబడి మరీ కొనుగోలు చేశారు. మృగశిర కార్తెను పురస్కరించుకుని చేపలను విక్రయించే వ్యాపారులు బొచ్చ, బంగారుతీగ, శీలావతి, కొరమీను, గడ్డిమోసు తదితర రకాల చేపలు కిలో రూ.200 నుంచి రూ.250, రూ.300 వరకు ధర నిర్ణయించినప్పటికీ ప్రజలు వాటిని క్యూల్లో నిలబడి మరీ కొనుగోలు చేయడంతో చేపలకు గిరాకీ పెరిగింది. దీంతో సారపాకలో పలు ప్రదేశాల్లో, బూర్గంపహాడ్, మోరంపల్లిబంజర్ గ్రామాల్లో చేపల విక్రయాలు భారీగా జరిగాయి.
మృగశిర కార్తె సందర్భంగా చేపమందు ప్రసాదం పంపిణీ బూర్గంపహాడ్‌లో ప్రతి ఏడాది ఆనవాయితీగా వస్తోంది. బూర్గంపహాడ్‌కు చెందిన మహ్మద్ హుస్సేన్ అలీ ఆధ్వర్యంలో ఉబ్బసం ఉన్న పిల్లలు, పెద్దలకు చేపమందు ప్రసాదాన్ని సోమవారం పంపిణీ చేశారు. ఈ చేపమందు ప్రసాదం తీసుకునేందుకు బూర్గంపహాడ్తో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.