రామవరం, జులై 05 : కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను మారిస్తే సహించేది లేదని ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ కె.సారయ్య అన్నారు. కేంద్రం 44 కార్మిక చట్టాలను రద్దు చేసి, వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను తీసుకురావడాన్ని నిరసిస్తూ ఈ నెల 9న చేపట్టిన దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శనివారం కొత్తగూడెం ఏరియాలోని పీవీకే 5 గని వద్ద ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సీఐటీయూ, టీబీజీకేఎస్ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన గేట్ మీటింగ్లో సారయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కార్మికులను కట్టు బానిసలుగా మార్చేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని విమర్శించారు. బొగ్గు బ్లాకులను వేలం వేసే ఎంఎండిసిఆర్ చట్టాన్ని తీసుకువచ్చి దేశ సంపదను పెట్టుబడిదారుల చేతిలో పెట్టి, విదేశాలకు తరలిస్తూ కార్మిక హక్కులను కాలరాయడానికి మోదీ ప్రభుత్వం పూనుకుందని ధ్వజమెత్తారు.
ప్రపంచ కార్మికులు ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న 8 గంటల పని దినాలను నేడు 12 గంటలుగా, 16 గంటలుగా మార్చే కుట్ర జరుగుతుందన్నారు. ప్రభుత్వ రంగ పరిశ్రమలను పెట్టుబడిదారులకు అమ్మకానికి పెట్టి కార్మికుల పొట్ట కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వంపై రైతులు తిరగబడి నల్ల చట్టాలను రద్దు చేయించి విజయం సాధించిన విధంగానే కార్మిక వర్గాలు పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ 9న దేశవ్యాప్తంగా జరిగే సమ్మె కార్మిక వర్గాల కోసం, బడుగు బలహీన వర్గాల హక్కుల పరిరక్షణ కోసం జరుగుతోందని, ఈ సమ్మెను జయప్రదం చేసి కార్మిక హక్కులను కాపాడుకోవాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి కామ్రేడ్ మల్లికార్జున్, ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ రజాక్, ఏఐటీయూసీ పిట్ కార్యదర్శి హుమాయూన్, ఐఎన్టీయూసీ పిట్ కార్యదర్శి చిలక రాజయ్య, సీఐటీయూ జిల్లా కార్యదర్శి రమేశ్, బ్రాంచ్ కార్యదర్శి విజయగిరి శ్రీనివాస్, టీబీజీకేఎస్ బ్రాంచ్ కార్యదర్శి గడప రాజయ్య, కతర్ల రాములు, సాయి పవన్, ఎస్.నాగేశ్వరరావు, సొంతబోయిన శ్రీనివాస్, సాంబమూర్తి, మధు కృష్ణ, కమల్, రాజేశ్వరరావు, బుక్య రమేశ్, రామచందర్, కుర్రు రమేశ్, క్రాంతి, సుమన్, దాసరి శ్రీను, బివి రమణ, మల్లయ్య, దేవ్ సింగ్, భాస్కర్, గోలే రామకృష్ణ, ప్రసాద్, అనిల్, ధర్మారావు, బాబురావు, మనీవ్, శ్రీకాంత్, రఫీ, శ్రీనివాస్, కారంమోహన్, సంతానం, బి.వెంకటేశ్వర్లు, రవి, ఎల్. రామచందర్, విక్రమ్, రమేశ్, లక్ష్మణ్, రఘు, చంద్రశేఖర్, ఆకుల శ్రీనివాస్, పీవీకే కార్మికులు పాల్గొన్నారు.