– తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి భూక్యా వీరభద్రం
– 20న కొత్తగూడెంలో జిల్లా మహాసభలు
జూలూరుపాడు, సెప్టెంబర్ 16 : రాజ్యాంగం కల్పించిన గిరిజన హక్కులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాలరాస్తోందని, కార్పొరేట్ శక్తులకు గిరిజన భూములను కట్టబెట్టేందుకు కుట్రలు పన్నుతోందని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి భూక్యా వీరభద్రం అన్నారు. మరోవైపు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సైతం ఎన్నికల వాగ్దానాలను విస్మరించి గిరిజనులకు ద్రోహం చేసిందని ఆయన మండిపడ్డారు. జూలూరుపాడు మండల కేంద్రంలోని కంగాల బుచ్చయ్య భవన్లో బానోతు ఈశ్వర్ నాయక్ అధ్యక్షతన బుధవారం జరిగిన తెలంగాణ గిరిజన సంఘం మండల మహాసభకు ముఖ్య అతిథిగా హాజరైన వీరభద్రం మాట్లాడా రు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ చేసిన చేవెళ్ల డిక్లరేషన్ ఏమైందని ప్రశ్నించారు. ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా ప్రభుత్వం గిరిజనులను మోసపూరితంగా వంచిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనుల హక్కుల సాధన కోసం తెలంగాణ గిరిజన సంఘం దశాబ్దాలుగా రాజీలేని పోరాటాలు చేస్తోందని గుర్తుచేశారు. పోడు భూములకు పట్టాలు సాధించడంలో, తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా గుర్తించేలా చేయడంలో సంఘం చేసిన పాదయాత్రలు, ఆందోళనలను ప్రస్తావించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న గిరిజన వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు గిరిజనులంతా ఐక్యంగా పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కన్వీనర్ వాంకుడోత్ అమర్ సింగ్ నాయక్ మాట్లాడుతూ.. గిరిజన సమస్యల పరిష్కారమే లక్ష్యంగా భవిష్యత్లో చేపట్టే పోరాటాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ నెల 20న కొత్తగూడెం లక్ష్మీదేవిపల్లి మార్కెట్ యార్డులో జరగనున్న జిల్లా స్థాయి మహాసభలను అత్యధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు బానోతు మధు, మాలోతు రాములు, భూక్య బిచ్చా, ఇస్లావత్ బద్రు, ధారావత్ నరసింహారావు, బోడ రాజ్ కుమార్, భూక్య సురేష్, బానోత్ రూప, జరుపుల మల్లయ్య, భానోత్ సామ్య, ధారావత్ వేణు, మాలోత్ తులశ్య పాల్గొన్నారు. వీరితో పాటు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు యాస నరేష్, డీవైఎఫ్ఐ నాయకులు వల్ల మల్ల చందర్రావు, సీఐటీయూ జూలూరుపాడు మండల కన్వీనర్ బోడ అభిమిత్ర పాల్గొన్నారు.

‘గిరిజన హక్కులను కాలరాస్తున్న కేంద్రం.. మాట తప్పిన రాష్ట్ర ప్రభుత్వం’