బెంగళూరు: ఒక యువతి తన బంధువు, ఫ్రెండ్‌తో కలిసి విహార యాత్రకు వెళ్లింది. హోటల్లో బస చేసిన ఆమె చాక్లెట్ తిన్నది. ఆ తర్వాత స్నానం కోసం వెళ్తూ బాత్రూమ్ వద్ద కుప్పకూలి మరణించింది. ఆ యువతి మృతిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (woman eats chocolate and dies) కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బెంగళూరుకు చెందిన 23 ఏళ్ల వర్ష, సెప్టెంబర్ 11న తన కజిన్, స్నేహితుడితో కలిసి విహారయాత్రకు వెళ్లింది. సకలేష్‌పూర్‌లోని లాడ్జిలో వారితో కలిసి ఆమె బస చేసింది.
కాగా, స్నానానికి వెళ్లే ముందు వర్ష ఒక చాక్లెట్ తిన్నది. ఆ తర్వాత బాత్రూమ్ వైపు నడుచుకుంటూ వెళ్తుండగా ఆమె ఒక్కసారిగా కిందపడిపోయింది. అక్కడికక్కడే మరణించింది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ లాడ్జి వద్దకు చేరుకున్నారు. వర్ష మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ఆ యువతితో పాటు ఉన్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు విచారించారు.
మరోవైపు ఆ యువతి మృతికి కారణం ఏమిటన్నది పోస్ట్‌మార్టం రిపోర్ట్ తర్వాత తెలుస్తుందని పోలీస్ అధికారి తెలిపారు. ఆమె మరణంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.