Diana | వేల్స్ (Wales) యువరాణి డయానా 1997, ఆగస్టు 31న పారిస్‌లో కారు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదానికి సంభవించిన ఆరువేల పేజీల ఫ్రెంచ్ పోలీసుల డాజియర్ (French police dossier)ను 2082 వరకు రహస్యంగా ఉంచనున్నారు. పారిస్‌లోని పాలేస్ డి జస్టిస్ నేలమాళిగలో ఒక మీటర్ ఎత్తులో ఈ ఫైలు ఉంది. ప్రిన్సెస్, ఆమె జీవిత భాగస్వామి డోడి అల్ ఫాయెద్, కారు డ్రైవర్ హెన్రీ పాల్ ఆ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంపై సుమారు 18 నెలల ఫ్రెంచ్ పోలీసుల విచారణ, న్యాయ విచారణ అనంతరం ఈ ఫైలును రూపొందించారు. ఎప్స్టీన్ ఫైల్స్ ఎంత సంచలనంగా మారాయో, అంతకంటే ఎక్కువగా సంచలనంగా ఉన్న ఈ ఫైలు 2082 వరకు తెరవరు. బహుశా ఎప్పటికీ తెరవకపోచ్చని పలువురు అధికారులు పేర్కొంటున్నారు.
అప్పట్లో సంచలనంగా మారిన ఈ ప్రమాదానికి మద్యం, మాదకద్రవ్యాలు, అతివేగం కారణమని పేర్కొంటూ అప్పటి మేజిస్ట్రేట్ హెర్వ్ స్టీఫెన్ తీర్సు ఇస్తూ ఈ కేసును మూసివేశారు. ప్రమాదాని కంటే ముందు వీరి కారును వెంబడిస్తున్న తొమ్మిదిమంది ఫొటోగ్రాఫర్లు, బైక్ నడుతున్న మరో వ్యక్తిని నిర్దోషులుగా తీర్పు ఇచ్చారు. ప్రొఫెసర్ ఇవాన్ రికార్డెల్ టాక్సికాలజీ అధ్యయనం ప్రకారం ద్రైవర్ రక్తంలో ఆల్కహాల్ స్థాయి ఫ్రాన్స్ చట్టపరమైన పరిమితి కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉందని, డ్రగ్స్ కూడా తీసుకున్నట్లు తేలింది. 2008లో జరిగిన ఒక బ్రిటిష్ విచారణ కూడా దాదాపు ఇలాగే నిర్ధారించింది. ఫ్రాన్స్ వారసత్వ చట్టం ప్రకారం ఒక కేసు ముగిసిన తేదీ నుంచి 75 సంవత్సరాల పాటు నేషనల్ ఆర్కైవల్ ఫైళ్లను ప్రజలకు అందుబాటులో ఉంచరు. డయానా కేసు దర్యాప్తు 2007లో అధికారికంగా పూర్తయింది. దీంతో ఈ ఫైలును 2082లో బహిరంగపరుస్తారు.

Diana
పాలేస్ డి జస్టిస్‌కు చెందిన ఒక ప్రతినిధి ఈ ఫైలు పారిస్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ ఆర్కైవ్స్‌లో ఉందని, గడువు ముగిసేవరకు చట్టబద్ధంగా సంప్రదించకూడదని, డిజిటలైజ్లో కూడా లేదని వెల్లడించారు. ఈ ఆర్కైవ్ ఫైలు ఉనికిని తెలుసుకోవడానికి నెలలు పట్టింది. దానికి సాయుధ బలగాలు కాపలా కాస్తున్నాయి. అయితే 75 ఏండ్ల తరువాత ఆ ఫైలును తెరవవచ్చు లేదా నిరవధికంగా పొడిగించవచ్చు. కానీ ఆ ఫైలులో ఏముందో వివరించలేదు. మెర్సిడెస్ కారును ఢీకొట్టిన తెల్లటి ఫియట్ యూనో కారు గురించి ఇప్పటికీ ఆచూకీ లభించలేదని ఫ్రెంచ్ దర్యాప్తు అధికారులు తెలిపారు.
డయానా మొదట బ్రిటిష్ రాజ కుటుంబానికి చెందిన ప్రిన్స్ చార్లెస్‌ను వివాహం చేసుకుంది. వీరికి ప్రిన్స్ విలియం, ప్రిన్స్ హ్యారీ ఇద్దరు కుమారులు ఉన్నారు. తరువాత చార్లెస్‌తో విడిపోయి తనకు నచ్చినవారితో కలిసి జీవించింది. దీంతో ఈ ప్రమాదంపై పలు అనుమానాలకు తావిచ్చింది. ఇది ఒక ప్రమాదమేనని ఎలాంటి రహస్య హత్య కాదని బ్రిటన్, ఫ్రాన్స్ విచారణలు తేల్చాయి. కానీ ప్రమాద ఫైలును రహస్యంగా భద్రపరచడంతో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.