రామవరం, జూలై 4 : ట్రేడ్ యూనియన్లను నిర్వీర్యం చేయడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ కె.సారయ్య అన్నారు. శుక్రవారం సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని ఆర్ సి హెచ్ పిలో ఈ నెల 9న జరిగే సారత్రిక సమ్మెను జయప్రదం చేయాలని గేట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సీఐటీయూ, టీబీజీకేఎస్ల నాయకులు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడారు.
సింగరేణిలో ఒకప్పుడు ఒక లక్ష పదిహేను వేల మంది కార్మికులు పనిచేసే వారన్నారు. కానీ ప్రస్తుతం 32 వేల మంది కార్మికులు మాత్రమే పని చేస్తున్నట్లు తెలిపారు. కార్మికులను క్రమం క్రమంగా తగ్గించుకుంటూ, సింగరేణి సంస్థను మెల్లగా కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ వైపు తీసుకెళ్తుందన్నారు. ఒకప్పుడు 52 అండర్ గ్రౌండ్ మైన్స్, 14 ఓపెన్ కాస్ట్ లు ఉండేవని, కానీ ఇప్పుడు 22 అండర్ గ్రౌండ్ మైన్స్, 8 ఓపెన్ కాస్ట్ లు మాత్రమే ఉన్నట్లు చెప్పారు. మిగిలిన మైన్స్ అన్నిటిని ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టి ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పేరుతో వాళ్లకి చాలిచాలని జీతాలు ఇస్తూ రోజుకు రూ.500 జీతం ఇస్తున్నారని, కాంట్రాక్ట్ కార్మికులను 12 గంటలు పని చేయిస్తూ శ్రమ దోపిడి చేస్తున్నట్లు దుయ్యబట్టారు. సాఫ్ట్వేర్ ఉద్యోగుల పరిస్థితి చూస్తే వారిని ప్యాకేజీల పేరుతో ఉద్యోగాల్లోకి తీసుకుంటారు. 12 గంటలు, 15 గంటలు పనిచేయించుకుంటారు. కానీ వారి హక్కుల కోసం అడుగుదాం అంటే వాళ్లకి ట్రేడ్ యూనియన్స్ లేవు. ఒకవేళ అలా ప్రశ్నిస్తే వారికి ఉద్యోగ భద్రత ఉండదు. ఉద్యోగం ఉంటుందో లేదో తెలియని పరిస్థితి. ఇప్పుడు అదే విధానాన్ని కేంద్రం అన్ని అన్ని ప్రభుత్వరంగ సంస్థల్లో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా విభజించి కార్మిక హక్కులను కాలరాస్తుందని మండిపడ్డారు. ఈ కోడ్ ల విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 9న నిర్వహించే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను కార్మికులంతా విజయవంతం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ ఒక్కరోజు దేశవ్యాప్త సమ్మెతో కార్మిక శక్తి ఏంటో కేంద్ర ప్రభుత్వానికి తెలిసే విధంగా చేయాలన్నారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ కొత్తగూడెం బ్రాంచ్ సహాయ కార్యదర్శి జె.గట్టయ్య, ఐఎన్టీయూసీ పీవీకే పిట్ కార్యదర్శి చిలక రాజయ్య, సీఐటీయూ బ్రాంచ్ కార్యదర్శి విజయగిరి శ్రీనివాస్, టీబీజీకేఎస్ వైస్ ప్రెసిడెంట్ గడప రాజయ్య, పిట్ కార్యదర్శులు మధుకృష్ణ, కమల్, సందబోయిన శ్రీనివాస్, హుమాయూన్, వైస్ ప్రెసిడెంట్ కత్తెర్ల రాములు, ఎస్.నాగేశ్వరరావు, ఏఐటీయూసీ సీనియర్ నాయకులు, రాజలపూడి సాంబమర్తి, సురేందర్, మురళి, శేషగిరిరావు పాల్గొన్నారు.