జూలూరుపాడు, మే 14 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని గుండెపుడి రెవెన్యూ ప్రాంతం, సర్వే నంబర్ 117, సీలింగ్ భూమి ఆక్రమణలకు గురైతుందని, ఆ భూములను కాపాడాలని గ్రామీణ పేదల సంఘం ఆదివాసీ నాయకుడు బచ్చల లక్ష్మయ్య ప్రభుత్వాన్ని కోరారు. గిరిజన, గిరిజనేతర పేదలు మనుగడ కోసం ప్రభుత్వ భూముల్లోకి వెళ్తే రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు అడ్డుకుని పలు విధాలుగా ఇబ్బందులకు గురిచేస్తుంటారన్నారు. కానీ కొందరు బడాబాబులకు మాత్రం ఆయా శాఖలకు చెందిన అధికారులు కొందరు వత్తాసు పలుకుతూ గుండెపుడి రెవెన్యూ సర్వే నంబర్ 117లో కొంత సీలింగ్ భూమిని ఏజెన్సీ, గిరిజన ప్రాంత చట్టాలను ఉల్లంఘించి ఒకరిద్దరి వ్యక్తుల పేరున అక్రమంగా పట్టాలు చేసినట్లు ఆరోపించారు.
అట్టి భూముల్లో బినామీల పేరుతో, అక్రమ మార్గాన మైనింగ్ అనుమతులు తీసుకొచ్చినట్లు తెలిపారు. గత రెండు నెలల కాలంగా కాజేసిన సీలింగ్ భూమిలో పెద్ద ఎత్తున యంత్రాలతో గుట్టలను తవ్వి ప్రకృతిని విధ్వంసం చేస్తున్నట్లు చెప్పారు. వాటిని పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి పట్టాలను రద్దు చేయాలని కోరారు. టిప్పర్లతో రాత్రింబవళ్లు మట్టిని దూర ప్రాంతాలకు తరలిస్తూ లక్షల రూపాయలు కొల్లగొడుతున్నా సంబంధిత అధికారులు ప్రేక్షకపాత్ర వహించడం సరైంది కాదన్నారు. కొంతమంది ముఠాగా తయారై ధనార్జనే ధ్యేయంగా మట్టి మాఫియా దందా చేస్తున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపితే సీలింగ్ భూమిని పట్టా చేసిన విషయం తేటతెల్లమవుతుందన్నారు. సీలింగ్ భూమి ఆక్రమణ, నిబంధనలకు విరుద్ధంగా పట్టాలు చేయటం, గుట్టలను తవ్వి ప్రకృతిని విధ్వంసం చేయడం వంటి అక్రమాలపై సమగ్ర విచారణ జరుపాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్, భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనింగ్ ఆఫీసర్, కొత్తగూడెం రెవెన్యూ డివిజన్ ఆఫీసర్‌కు సైతం లిఖిత పూర్వకంగా విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఏజెన్సీ ప్రాంతంలో, చట్టాలకు విరుద్ధంగా సీలింగ్ భూములను ఆక్రమించి, మైనింగ్ మాఫియాకు పాల్పడుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.