జూలూరుపాడు, నవంబర్ 19 : ఖమ్మం మార్కెట్ యార్డుకు ధీటుగా పత్తి కొనుగోలు చేపడుతున్న జూలూరుపాడు మండల కేంద్రంలో సిసిఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు యల్లంకి సత్యనారాయణ, బీఆర్ఎస్ పార్టీ వైరా నియోజకవర్గ నాయకుడు లకావత్ గిరిబాబు ఆధ్వర్యంలో బుధవారం జూలూరుపాడు మండల కేంద్రంలో పత్తి కొనుగోలు కేంద్రం (సబ్ మార్కెట్ యార్డ్) ను పరిశీలించి రైతులు, హమాలీలు, ట్రేడర్లతో ఎంపీ మాట్లాడారు. అకాల వర్షాల కారణంగా ఇప్పటికే దిగుబడి రాక అతలాకుతలమవుతున్న రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకునే ఆలోచనలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లేదని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు పండించిన పత్తిని అన్ని మార్కెట్లలో తేమ శాతంలో సంబంధం లేకుండా, తక్షణమే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.8,110 కి కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో రైతులను అన్ని రకాలుగా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు తొందరలోనే ఉన్నాయన్నారు. జూలూరుపాడు సోఫా మార్కెట్లో కొనుగోలు చేసిన పత్తిని తెలంగాణలో కొనుగోలు చేసేందుకు సీసీఐ కేంద్రాలు లేకపోవడంతో పక్క రాష్ట్రాలకు వ్యాపారులు పత్తిని తరలించాల్సి వస్తుందన్నారు. అత్యధికంగా విక్రయాలు నిర్వహించే సబ్ మార్కెట్ యార్డులో కనీస సౌకర్యాలు లేవని లైట్లు, త్రాగునీరు లేకపోవడం దారుణం అన్నారు. నిత్యం మార్కెట్ యార్డ్ లో పనిచేసే హమాలీలకు డ్రెస్ గాని, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించకపోవడం మార్కెట్ యార్డ్ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం అని దుయ్యబట్టారు. మార్కెట్ యార్డులో కనీసం మార్కెట్ కమిటీ అధికారులు లేకుండానే కొనుగోళ్లు చేపడుతూ ఉండటంతో మార్కెట్ యార్డ్ కు ఆదాయం కోల్పోయే అవకాశం ఉన్నా అధికారులు మార్కెట్ యార్డ్ వైపు కన్నెత్తి చూడకపోవడం సరైంది కాదన్నారు.
రైతుల పక్షాన అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లి రైతు సమస్యలపై తమ గళాన్ని ఢిల్లీలో వినిపించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్లమెంట్ లో తెలంగాణ రైతుల పక్షాన రైతుల సమస్యలపై గళం విప్పుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు యదలపల్లి వీరభద్రం, మండల అధ్యక్షుడు చాపలమడుగు రామ్మూర్తి, సొసైటీ డైరెక్టర్లు లకావత్ హేమ్లా, రెడ్డిబోయిన రాము, మండల నాయకులు తాళ్లూరి రామారావు, పురస్తపురవు రామకృష్ణ, పోతురాజు రామారావు, వాంకుడోత్ వెంకన్న, బానోతు శంకర్, మద్దిశెట్టి ప్రకాశ్, మాసినేన్ని శేషయ్య, వడ్డే సత్యనారాయణ, బానోత్ హరిలాల్, ఇల్లంగి తిరుపతి, మంద పుల్లయ్య, బోడా భోజ్య పాల్గొన్నారు.

Julurupadu : జూలూరుపాడులో సీసీఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి : ఎంపీ వద్దిరాజు రవిచంద్ర