– నెల రోజులు కొనసాగనున్న నమోదు ప్రక్రియ
చుంచుపల్లి, మే 19 : చేయూత పథకం కింద పెన్షన్ పొందుతున్న లబ్ధిదారుల కోసం నిర్వహిస్తున్న సిబిఎస్ లైవ్ పెన్షన్ అథెంటిఫికేషన్ ప్రక్రియ మంగళవారం రుద్రంపూర్ గ్రామ పంచాయతీలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని గ్రామ ఉప సర్పంచ్ సంతోష్ కుమార్, గ్రామ కార్యదర్శి నరేందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి రుద్రంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు కలిపి మొత్తం 611 మంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నట్లు తెలిపారు. ప్రభుత్వ సూచనల మేరకు ప్రతి పెన్షన్‌దారుడు తప్పనిసరిగా సిబిఎస్ లైవ్ పెన్షన్ అథెంటిఫికేషన్ ప్రక్రియలో పాల్గొనాలని కోరారు.
పెన్షన్‌దారులు తమ ఆధార్ కార్డుతో హాజరు కావాలని, ఆధార్ ఆధారంగా ఐరిష్ స్కాన్ లేదా వేలిముద్రల ద్వారా ఆన్లైన్ అథెంటిఫికేషన్ నిర్వహిస్తారని వివరించారు. ఈ ప్రక్రియ ద్వారా అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ మరింత పారదర్శకంగా, సులభంగా జరుగుతుందని తెలిపారు. ఈ నమోదు కార్యక్రమం నెల రోజుల పాటు కొనసాగుతుందని, ఎవరూ నిర్లక్ష్యం చేయకుండా నిర్ణీత సమయంలో తమ అథెంటిఫికేషన్ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు పాల్గొన్నారు.