టేకులపల్లి, జనవరి 27 : ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని సులానగర్ పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ల సమర్పణలో అవకతవకలకు పాల్పడి విజయం సాధించిన ముగ్గురు అభ్యర్థులపై కేసులు నమోదు చేయాలని సులానగర్ గ్రామస్తుడు నరసింగం చరణ్ కుమార్ అన్నారు. టేకులపల్లి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సులానగర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నేర చరిత్ర, అభియోగాలు కలిగి ఉన్న అభ్యర్థులు, ఎన్నికల రిటర్నింగ్ అధికారి స్టేజ్1లో కుమ్మకైయ్యారని తెలిపారు. నామినేషన్ పత్రాల్లో ఏ కేసులు లేవని, వారిపై ఉన్న కేసుల వివరాలు బహిర్గతం చేయకుండా ఎన్నికల్లో పోటికి అర్హత సాధించి అక్రమ విజయం సాధించారన్నారు. అభ్యర్థుల నేర చరిత్రకు సంబంధించిన ఆధారలతో టేకులపల్లి ఎస్ హేచ్ ఓ, పోలీస్ ఉన్నతాధికారులకు పలుమార్లు ఫిర్యాదులు ఇచ్చినా నేటి వరకు ఎటువంటి కేసులు నమోదు చేయలేదని ఆరోపించారు.
సులానగర్ పంచాయతీలో సర్పంచ్ గుగులోత్ లక్ష్మా నాయక్, ఉప సర్పంచ్ చెన్నయ్య, 5వ వార్డు మెంబర్ బానోత్ సరిలాల్ తమ నామినేషన్ పత్రాల్లో పేజీ నెంబర్ 5 వారిపై నేరాలు లేవని, పేజి నెంబర్ 11లో ఏ విషయాన్ని రహస్య పరచలేదని ఇద్దరు సాక్షులు కూడా సెల్ఫ్ డిక్లరేషన్ పై సంతకం చేశారన్నారు. నేర చరిత్ర కలిగిన వారికి సాక్షి సంతకాలు పెట్టిన వారిపై గత నెల 24 నుండి పలుమార్లు ఫిర్యాదులు చేసి ఇల్లెందు కోర్డు నుండి ఈ నెల 11న రిఫర్ అయినప్పటికి టేకులపల్లి పోలీసులు, ఎస్ఎచ్ఓ స్పందించలేదని ఆరోపించారు. న్యాయస్థానం సూచనలు పరిగణలోకి తీసుకుని వెంకటనే నేరస్తులపై కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.