జూలూరుపాడు, మార్చి 25 : శాంతియుతంగా హైదరాబాద్ అసెంబ్లీ వద్ద ధర్నా చేసేందుకు వెళ్తున్న ఆశా వర్కర్లపై పెట్టిన అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలని సీఐటీయూ జూలూరుపాడు మండల నాయకుడు చందర్ రావు డిమాండ్ చేశారు. మంగళవారం సీఐటీయూ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి ముందు ఆశా కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చందర్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఆశా వర్కర్లకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా వారిని ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. ఎన్నికల సందర్భంలో ఇచ్చినటువంటి హామీ మేరకు కనీస వేతనం రూ.18 వేలు వెంటనే ఇవ్వాలని, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు.
ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. అందుకే ఛలో అసెంబ్లీ ముట్టడి చేస్తున్న సందర్భంలో వారిని అక్రమంగా అరెస్ట్ చేయడం సరైంది కాదన్నారు. ఆశా వర్కర్ల డిమాండ్లను పూర్తిస్థాయిలో పరిష్కరించాలని లేకపోతే ప్రభుత్వంపై మరింత నిరసన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్ల జిల్లా అధ్యక్షురాలు పూణెం ఝాన్సీ, మండల అధ్యక్షురాలు నీలిమ, నాయకులు దివిలి, సీఐటీయూ నాయకులు బొల్లి లక్ష్మయ్య, శారద, వసుంధర, యేసు, మణి, కళ్యాణి, వెంకట్ లక్ష్మి పాల్గొన్నారు.