కరకగూడెం, ఆగస్టు 15 : వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన సంఘటన కరకగూడెం మండల పరిధిలోని రాళ్లవాగు వద్ద శనివారం చోటుచేసుకుంది. ఇందుకు సంభందించి ఎస్ఐ పీవీ నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం… కరకగూడెం నుండి మణుగూరు వైపు ప్రయాణీకులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సును మణుగూరు నుండి కరకగూడెం వైపు వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి రాళ్లవాగు వద్ద ఢీ కొట్టింది. దీంతో బస్సులో ప్రయాణీకులకు స్వల్ప గాయాలు కాగా కారులో ప్రయాణీస్తున్న చక్రపాణి అనే వ్యక్తికి కారులోని ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో పెను ప్రమాదం తప్పింది. సదరు వ్యక్తికి ఓ చేయ్యి విరిగి తీవ్ర రక్తస్రావం అయ్యింది. విషయం తెలుసుకున్న పోలీస్ సిబ్బంది ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆర్టీసీ డ్రైవర్ ఫిర్యాదు మేరకు కారు నడుపుతున్న వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.