– జూన్ 2న కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ఎదుట ఆందోళన
– ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేశ్‌నాయక్
రుద్రంపూర్, మే 22 : సింగరేణి ప్రభావిత గ్రామాల అభివృద్ధి, గిరిజన హక్కుల పరిరక్షణ కోసం జూన్ 2న కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట చేపట్టే మహా ధర్నాను జయప్రదం చేయాలని లంబాడి హక్కుల పోరాట సమితి (LHPS) రాష్ట్ర అధ్యక్షుడు, ఎస్టీ సంఘాల ఐక్య వేదిక కోఆర్డినేటర్ రాజేశ్ నాయక్ పిలుపునిచ్చారు. శుక్రవారం రుద్రంపూర్ తండాలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 1997 సమతా జడ్జిమెంట్, 1996 పీసా చట్టం ప్రకారం ఏజెన్సీ ప్రాంతాల్లోని సింగరేణి సంస్థలో గిరిజనులకు 100 శాతం ఉద్యోగ రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. జూన్ 2న పోస్టాఫీస్ సెంటర్లోని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం అక్కడి నుండి సింగరేణి హెడ్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు.
సింగరేణి VK OC-I & IIలో ఓబీ కాంట్రాక్ట్ దక్కించుకున్న “సోద కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్” సంస్థలో స్థానిక గిరిజనులకు 100 శాతం కాంట్రాక్ట్ ఉద్యోగాలు కల్పించాలని కోరారు. ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను తీసుకొచ్చి తక్కువ వేతనాలతో 12 గంటలు పని చేయించడం వల్ల స్థానికులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. పలుమార్లు యాజమాన్య దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపోవడం అనుమానాలకు తావిస్తోందని ఆరోపించారు. కొత్తగూడెం ఏరియాలో కాంట్రాక్ట్ సెక్యూరిటీ బాధ్యతలు నిర్వహిస్తున్న “లక్ష్మీ నరసింహ” సెక్యూరిటీ ఏజెన్సీ లైసెన్స్‌ను 5వ షెడ్యూల్, 1/70 చట్టం, పీసా యాక్ట్ ప్రకారం రద్దు చేసి గిరిజనులకు మాత్రమే కేటాయించాలని డిమాండ్ చేశారు. ఓపెన్‌కాస్ట్ గనుల్లో జరుగుతున్న బ్లాస్టింగ్ల వల్ల ఇండ్లకు పగుళ్లు రావడం, దుమ్ము కాలుష్యం పెరగడం, చెరువులు ఎండిపోవడం, వ్యవసాయ భూములు బీడు భూములుగా మారడం, రైతులు జీవనోపాధి కోల్పోవడం వంటి తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.
బ్లాస్టింగ్లను నిలిపివేసి యంత్రాల సహాయంతో తవ్వకాలు చేపట్టాలని, ఓపెన్‌కాస్ట్‌లకు బదులుగా భూగర్భ గనులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. సింగరేణి ఉత్పత్తిలో 43 శాతం ఏజెన్సీ ప్రాంతాల నుంచే వస్తోందని, అందుకు అనుగుణంగా CSR నిధుల్లో 43 శాతం గిరిజన గ్రామాల అభివృద్ధికి కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పంతుల్య నాయక్, గిరిజన నాయకుడు హరి నాయక్, జిల్లా కార్యదర్శి కుశా నాయక్, ధన్‌బాద్ మాజీ సర్పంచ్ రాందాస్ నాయక్, లచ్చు నాయక్, మోతీలాల్ నాయక్, లక్షపతి నాయక్, సాయి నాయక్, గణేష్ నాయక్, నాగరాజు నాయక్, అజయ్ పాల్గొన్నారు.

సింగరేణి ప్రభావిత గ్రామాల సమస్యలపై మహా ధర్నాకు పిలుపు