– సీఎం వస్తున్నా పట్టించుకోని అధికార యంత్రాంగం
బూర్గంపహాడ్, మార్చి 26 : బూర్గంపహాడ్ మండలంలో రహదారుల పరిస్థితి మూన్నాళ్ల ముచ్చటే అన్న చందంగా తయారైంది. భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ముక్కోటి ఉత్సవాల నేపథ్యంలో గుంతలు పడ్డ రహదారులకు సంబంధిత అధికారులు మరమ్మతులు చేయించారు. అయితే ఆ ఉత్సవం ముగిసి పట్టుమని మూడు నెలలు కాకముందే మళ్లీ మండల కేంద్రంలోని జాతీయ రహదారి గుంతలతో దర్శనమిస్తుంది. అక్టోబర్ నెలాఖరు సమయంలో మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు జిల్లాలో గుంతల మయంగా మారిన రహదారుల పరిస్థితిపై బీఆర్ఎస్ నాయకులకు గుంతలతో సెల్ఫీ కార్యక్రమాన్ని చేపట్టి ఎక్కడ గుంతలు ఉంటే అక్కడ బీఆర్ఎస్ నాయకులు నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
ఆ సమయంలో రోజుల వ్యవధిలో ఎక్కడికక్కడ అధికార యంత్రాంగం స్పందించి గుంతలు పడిన రహదారులకు మరమ్మతుల కార్యక్రమం చేపట్టారు. అయితే మరమ్మతులు చేపట్టిన మూన్నాళ్లకే మరమ్మతులు చేసిన రహదారులు మళ్లీ గుంతలతో దర్శనమిచ్చాయి. దీంతో జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులు పడుతున్న ఇబ్బందులు వర్ణణాతీతం. ఈ రహదారులపై ప్రయాణం నరకప్రాయంగా మారిందని వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు.
శ్రీరామ నవమి ఉత్సవాలకు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం భద్రాచలం రానున్నారు. ఆయన పర్యటన అధికారికంగా ఖరారు అయినప్పటికీ జాతీయ రహదారి గుంతలతో ఉన్నా సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోకుండా అయితే మాకేంటి అన్న నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం పట్ల వాహనదారులు మండిపడుతున్నారు. అయితే మణుగూరు క్రాస్ రోడ్డు మీదుగా భద్రాచలం వెళ్లేందుకు ప్రధాన రహదారి ఉండటంతో సీఎం హెలీకాఫ్టర్ ద్వారా ఐటీసీ బీపీఎల్ స్కూల్కు వచ్చి రోడ్డు మార్గాన భద్రాచలం వెళతారు కదా… బూర్గంపహాడ్ సారపాక ప్రధాన జాతీయ రహదారిలో కాదు కదా వెళ్లేది అని సంబంధిత శాఖ అధికారులు ధీమాతో గోతులు పడ్డ రహదారికి మరమ్మతులు చేపట్టలేదనే వాదనలూ ప్రజల నుంచి లేకపోలేదు. వేలసంఖ్యలో ఈ రహదారి గుండా వాహనాలు ప్రయాణం చేస్తుంటాయని వాహనదారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తక్షణమే గుంతల రహదారికి మరమ్మతులు చేయించాలని మండల ప్రజలు, వాహనదారులు ముక్తకంఠంతో కోరుతున్నారు.

గుంతలమయంగా బూర్గంపహాడ్- సారపాక జాతీయ రహదారి