– యంత్ర నాగరికతలో కనుమరుగవుతున్న ఎడ్ల బండ్లు
జూలూరుపాడు, ఏప్రిల్ 24 : కాలం చక్రంలా తిరుగుతుంది అంటారు. కానీ ఆ కాలం సృష్టించిన ‘ఆధునికత’ అనే వేగంలో రైతుకు వెన్నెముకగా నిలిచిన ఎడ్లబండి చక్రం నేడు శాశ్వతంగా ఆగిపోతోంది. ఒకప్పుడు పల్లెటూరి జీవనశైలికి చిహ్నంగా, రైతు గర్వంగా ఊరేగే రాజదర్బారుగా వెలిగిన ఎడ్లబండ్లు నేడు పనికిరాని సామానుగా మారి పాత ఇనుప అంగడికి చేరుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గుండెపూడి గ్రామంలో గురువారం కనిపించిన దృశ్యం మారుతున్న కాలానికి సజీవ సాక్ష్యంగా నిలిచింది.
ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి రైతు ఇంటి ముందు ఒక ఎడ్లబండి కళకళలాడుతూ కనిపించేది. పొలం పనులకు వెళ్లాలన్నా, పండించిన పంటను ఇంటికి చేర్చాలన్నా, చివరకు శుభకార్యాలకు బంధువులను తీసుకురావాలన్నా ఎడ్లబండే ఏకైక ఆధారం. కానీ నేడు ట్రాక్టర్లు, పవర్ టిల్లర్లు, ఆటో ట్రాలీల వంటి ఆధునిక యంత్రాల రాకతో ఎడ్లబండి ప్రాధాన్యత పూర్తిగా తగ్గిపోయింది. గంటల కొద్దీ పట్టే పనిని నిమిషాల్లో ముగించే యంత్రాల వైపు మొగ్గు చూపుతున్న తరుణంలో, మూగజీవాలను సాకడం భారంగా మారడం, బండి తయారీ, మరమ్మతులు చేసే వడ్రంగులు కరువవ్వడం ఎడ్లబండ్ల ఉనికిని ప్రశ్నార్థకం చేసింది.
గుండెపూడి గ్రామానికి చెందిన ఓ రైతు తన వద్ద దశాబ్దాలుగా ఉన్న ఎడ్లబండిని, అది పాడైపోయి ఇంట్లో స్థలాన్ని ఆక్రమిస్తుండడంతో చివరకు పాత సామాను కొనేవారికి విక్రయించాడు. బండికి ఉన్న చెక్క భాగాలను తొలగించి, అందులోని ఇనుప ఇరుసును, ఇనుప చుట్టు కలిగిన చక్రాలను కార్మికులు ఒక ఆటో ట్రాలీలోకి ఎక్కిస్తున్న దృశ్యం చూపరులను ఆలోచింపజేసింది. ఒకప్పుడు వ్యవసాయంలో కీలకంగా ఉండి, లక్ష్మీదేవిగా భావించిన బండిని ఇలా తుక్కు కింద విక్రయించడం చూసి పాత తరం రైతులు నిట్టూరుస్తున్నారు.
ప్రస్తుత వేగవంతమైన ప్రపంచంలో ఎడ్ల బండ్లు కేవలం ప్రదర్శన వస్తువులుగా మారుతున్నాయి. ఆధునికత పేరుతో మనం సాధిస్తున్న అభివృద్ధిలో మన సంస్కృతికి చిహ్నాలైన ఇలాంటి వస్తువులను కోల్పోతున్నాం. రాబోయే తరాలకు ఎడ్లబండి అంటే ఎలా ఉంటుందో తెలియజెప్పాలంటే, పాత పుస్తకాల్లోని బొమ్మలనో లేదా మ్యూజియంలోని నమూనాలనో చూపించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ”ఒకప్పుడు ఎడ్లబండి నడుస్తుంటే వచ్చే ఆ ‘కిర్రు’ చెప్పుల శబ్దం, ఎడ్ల మెడలోని గంటల మోత పల్లెటూరి సంగీతంలా ఉండేది. ఇప్పుడు ఆ శబ్దం వినిపించడం లేదు. ఆ వైభవం కనిపించడం లేదు.” అని స్థానిక వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ దృశ్యం కేవలం ఒక పాత సామాను విక్రయం మాత్రమే కాదు. ఒక శకం ముగింపునకు సంకేతం. సాంకేతికత ఎన్ని మార్పులు తెచ్చినా, మట్టి మనుషుల మమకారాన్ని, గ్రామీణ భారత ఆత్మను చాటిచెప్పిన ఎడ్లబండి చరిత్ర పుటలకే పరిమితం కావడం నిజంగా విషాదకరం. ప్రస్తుతం వస్తున్న యంత్ర పరికరాలు రైతులకు అందుబాటులోకి రావడంతో పాటు సమయం కలిసి వస్తుండడం. ఎడ్లను సాకేందుకు రైతులు పడుతున్న శ్రమ అధికం కావడంతో కాలక్రమేనా ఎడ్లు, ఎడ్ల బండ్లు కనుమరుగవుతూ వస్తున్నాయి.