రామవరం, మార్చి 19 : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో మైనారిటీలకు సముచిత స్థానం దక్కలేదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎండీ.యాకుబ్ పాషా అన్నారు. బుధవారం ఓ ప్రకటనలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్లో మైనారిటీలకు రూ.3,591 కోట్లు ప్రతిపాదించి, అందులో రూ.840 కోట్లు రాజీవ్ యువ వికాసం కింద ఖర్చు చేయనున్నట్టు తెలుపడం దారుణమన్నారు. మైనారిటీల కోసం ఏ ఒక్క పథకం కూడా ప్రవేశ పెట్టలేదన్నారు.
మైనారిటీ మహిళల కోసం ఉచిత కుట్టు మిషన్లు పొందేందుకు దరఖాస్తు స్వీకరించి 4 నెలలు గడిచినా నేటివరకు లబ్దిదారుల ఎంపిక జరగలేదన్నారు. షాదీ ముబారక్ పథకానికి దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులకు సంవత్సరం దాటిన చెక్కులు అందటం లేదని, సీఎం ఓవర్సీస్ ఉపకార వేతనాలకు ధరఖాస్తు చేసుకున్న విద్యార్దులకు కోర్సు ముగిసినప్పటికీ ఉపకార వేతనాలు అందక విద్యార్దులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు.
అదేవిధంగా పెండింగ్లో ఉన్న పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ విడుదలకు మోక్షం కలగటంలేదని, మైనారిటీ గురుకుల డిగ్రీ కళాశాల, మైనారిటీ స్టడీ సర్కిళ్లు అందని ద్రాక్షగానే మిగిలాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటిన మైనారిటి శాఖకు మంత్రిని కేటాయించలేదని, తద్వారా మైనారిటీ సమస్యలు ఆలకించే నాథుడే కరువయ్యాడన్నారు. మైనారిటీ సంక్షేమ శాఖకు నేటివరకు ఐఏఎస్ హోదా కలిగిన అధికారి లేడని, కామారెడ్డి మైనారిటీ డిక్లరేషన్ కలగానే మిగిలిందన్నారు. ఇందిరమ్మ ఇండ్ల కమిటీలో మైనార్టీలకు సముచిత స్థానం కల్పించలేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి మైనారిటీ సమస్యల పట్ల దృష్టి సారించి మైనారిటీలకు అండగా నిలువాలని విజ్ఞప్తి చేశారు.