జూలూరుపాడు, ఏప్రిల్ 19 : ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభను విజయవంతం చేయాలని వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు లకావత్ గిరిబాబు శనివారం పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో, పాడి పంటలతో ఆనందంతో జీవించారని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు అనేక కష్టాలను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. రైతు బంధు లేక, సమయానికి పింఛన్లు ఇవ్వక అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వము చేసిన అభివృద్ధి పనులే నేడు కనిపిస్తున్నాయన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఉచిత పథకాలు కాదని అవి ఉత్త పథకాలే అన్నారు. మండలంలోనే కాకుండా రాష్ట్రంలో కూడా ఎక్కడ చూసినా వరి పంటలు ఎండిపోతున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని, అది మాని అభివృద్ధిపై దృష్టిపెట్టాలని హితవు పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయిందని మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.