– బీఆర్ఎస్ నాయకుడు లకావత్ గిరిబాబు
– ప్రజా సమస్యలపై గళమెత్తాలని పిలుపు
జూలూరుపాడు, ఆగస్టు 28 : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీఆర్ఎస్ నాయకుడు లకావత్ గిరిబాబు ప్రభుత్వాన్ని విమర్శించారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ సెప్టెంబర్ 2 నుండి 9వ తేదీ వరకు నియోజకవర్గ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు శుక్రవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఎన్నికల ముందు 420 హామీలు, 13 డిక్లరేషన్లు, 6 గ్యారెంటీలు ప్రకటించి, వంద రోజుల్లో అమలు చేస్తామని ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు.
నాటి గ్యారెంటీ కార్డులు నేడు బాకీ కార్డులుగా మారాయని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఈ బాకీ కార్డులను నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ చేరవేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రైతులకు సకాలంలో యూరియా, సాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీతారామ, కాళేశ్వరం ప్రాజెక్టుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తూ, ప్రజలకు తాగునీటి ఎద్దడి లేకుండా చూడటంలో ప్రభుత్వం చేతులెత్తేసిందని ధ్వజమెత్తారు. ప్రజల పక్షాన నిలబడి నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు, బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు తరలిరావాలని పిలుపునిచ్చారు.