ఇల్లెందు, అక్టోబర్ 24 : అధ్వానంగా ఉన్న రహదారులపై ప్రజలు అనుభవిస్తున్న నరకాన్ని చూపిస్తూ బీఆర్ఎస్ నాయకులు సదరు రోడ్లపై శుక్రవారం నిరసన తెలిపారు. బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఇచ్చిన డిజిటల్ సెల్ఫీ పిలుపు మేరకు గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు దిండిగాల రాజేందర్ నాయకత్వంలో ఇల్లెందు పట్టణం నుండి ఖమ్మం వెళ్లే రహదారి మధ్యలో పెద్ద పెద్ద గుంతలు పడి రోడ్డు పూర్తిగా పాడై వర్షపు నీటితో ప్రమాదకరంగా మారింది. రహదారి దుస్థితిని చూపిస్తూ గుంతలలో మొక్కలు నాటి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా దిండిగాల రాజేందర్ మాట్లాడుతూ.. వాహనాల మీద ట్యాక్స్‌లు పెంచి డబ్బులు గుంజుతున్న ప్రభుత్వం రోడ్లను మరమ్మతులు చేయడంలో విఫలమైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు కావస్తున్నా రోడ్లమీద తట్టెడు మట్టి పోసిన పాపాన పోలేదని విమర్శించారు. ఇప్పటికైనా రోడ్లకు మరమ్మతులు చేయాలని లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎస్.రంగనాథ్, పట్టణ ఉపాధ్యక్షుడు అబ్దుల్ నబీ, మూలగుండ్ల ఉపేందర్, పాలడుగు రాజశేఖర్, పరికపల్లి రవి, మునిగంటి శివ, బజారు సత్యనారాయణ, ఇమ్రాన్, గడ్డి శ్రీను, డేరంగుల పోషం, రాందాస్, లవకుశ పాల్గొన్నారు.

Yellandu : రహదారుల మరమ్మతులు చేయాలని బీఆర్ఎస్ నాయకుల నిరసన