దామచర్ల, మే 11 : దామరచర్ల మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు మెజార్టీ స్థానాలు గెలుపొందారు. మండలంలోని దామరచర్ల, బొత్తలపాలెం, రాజగట్టు గ్రామాల సంఘంలో 9 కార్యవర్గ సభ్యులుండగా ఇద్దరు సభ్యులు బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగతా 7 సభ్యులకు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం ఎన్నికలు జరుగగా ఆరుగురు బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారు. ఒకరు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలుపొందడం జరిగింది. మత్స్య కార్మిక సంఘానికి గతంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
ఈసారి కార్యవర్గానికి పోటీ పడడంతో ఎన్నికలను నిర్వహించారు. ఎన్నికలను కొంత మేరకు ప్రతిష్టాత్మకంగా తీసుకోగా వాడపల్లి పోలీసులు పోలింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు పరిచారు. ఎలాంటి సంఘటన జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగింది. నూతనంగా ఎన్నిక కాబడిన కార్యవర్గ సభ్యులు రేపు సంఘ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు మెజార్టీ స్థానంలో గెలుపొందడంతో మండల కేంద్రంలో టపాకాయలు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. నూతనంగా ఎన్నుకున్న వారికి పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు.