– బీఆర్ఎస్ భద్రాచలం నియోజకవర్గ ఇన్చార్జి రావులపల్లి రాంప్రసాద్
భద్రాచలం, సెప్టెంబర్ 08 : వెయ్యి రోజుల కాంగ్రెస్ దగా పాలనకు వ్యతిరేకంగా భద్రాచలం నియోజకవర్గ వ్యాప్తంగా వారం రోజుల పాటు గులాబీ సైన్యం పెద్ద ఎత్తున పోరాటం చేసినందని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి రావులపల్లి రాంప్రసాద్, నాయకుడు మానే రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం కాదు.. రాక్షస పాలన నడుస్తోందని విమర్శించారు. రాహుల్ గాంధీ బ్లాక్ టీషర్ట్ వేసుకుని పార్లమెంట్‌కు వెళ్లవచ్చు కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్ల టీషర్టులు, నల్ల చీరలు ధరించి అసెంబ్లీకి వెళ్లకూడదా? అని ప్రశ్నించారు. అసెంబ్లీ బయట ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అడ్డుకోవడం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు. బీఆర్ఎస్ నేత తాతా మధు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతున్న ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై దాడులు చేయడం సిగ్గుచేటన్నారు.
భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు అభివృద్ధి కోసం పార్టీ మారానని చెప్పారని, ఇప్పటివరకు నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. భద్రాచలం నుండి వాజేడు వరకు రోడ్లపై కనీసం తట్ట మట్టి కూడా పోయలేదని విమర్శించారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి రామాలయ అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేయాలన్నారు. ప్రతిరోజూ వేలాది ఇసుక లారీల రాకపోకల ద్వారా వస్తున్న ఆదాయం ఎవరి ఖాతాలోకి వెళ్తుందో ప్రభుత్వం స్పష్టం చేయాలని ప్రశ్నించారు. తాళ్లపేరు ప్రాజెక్టు కుడి కాలువ, ఎడమ కాలువ పూడికతీత పనులను ఎందుకు ప్రారంభించలేదో ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే సమాధానం చెప్పాలన్నారు. భద్రాచలం నియోజకవర్గ ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ఎమ్మెల్యే అధికారాన్ని ఆస్వాదిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేంత వరకు గులాబీ సైన్యం ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. 6 గ్యారంటీలు, 420 హామీలు అమలు చేయాల్సిందే అని డిమాండ్ చేశారు.
వెయ్యి రోజుల కాంగ్రెస్ దగా పాలనకు వ్యతిరేకంగా వారం రోజుల పాటు నియోజకవర్గ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను విజయవంతం చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా విభాగం నాయకులు, యువజన విభాగం నాయకులు, అభిమానులకు వారు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ పోరాటం ఇక్కడితో ఆగదని, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతుందని నాయకులు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆకోజు సునీల్ కుమార్, కోటగిరి ప్రమోద్ కుమార్, రేపాక పూర్ణచంద్రరావు, వార్డు మెంబర్ కావూరు గోపి, తుమ్మలపల్లి ధనేశ్వరరావు, కొల్లం జయ ప్రేమ్ కుమార్, అయినవోలు పవన్ కుమార్ పాల్గొన్నారు.