కొత్తగూడెం, ఆగస్టు 2: వెనుకబడి జిల్లాల ప్రగతికి కేంద్ర ప్రభుత్వం, నీతిఆయోగ్ తీసుకొచ్చిన సంపూర్ణత అభియాన్ కార్యక్రమంలో కొత్తగూడెం జిల్లా సత్తా చాటింది. నీతి అయోగ్ ఆకాంక్షిత జిల్లాల అభివృద్ధిలో భాగంగా విద్య, ఆరోగ్యం, వైద్యం, వ్యవసాయం, మౌలిక వసతులు, సామాజిక సంక్షేమం వంటి ఆరు ముఖ్య సూచికలపై 100 శాతం అభివృద్ధి లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో మూడు సూచికలపై వంద శాతం సాధించి రాష్ట్రస్థాయి గుర్తింపు పొందింది. ఈ సందర్భంగా శనివారం నాడు హైదరాబాద్ రాజ్‌భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అవార్డు అందుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ.. ఈ అవార్డు రావడం జిల్లాలోని అధికార యంత్రాంగం, మండల అధికారులు, గ్రామస్థాయి సిబ్బంది, ప్రజల చొరవకు గుర్తింపుగా నిలిచిందని అన్నారు. ప్రతి గ్రామానికీ అభివృద్ధి కల్పించాలన్న సంకల్పంతో అన్ని శాఖలు సమన్వయంతో పని చేశాయని తెలిపారు. ప్రతి సూచికపై కట్టుదిట్టమైన కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళ్లడం వల్లే ఈ విజయం సాధ్యమైందని పేర్కొన్నారు. ఈ అవార్డు మాకు మరింత బాధ్యతను పెంచిందన్నారు. అభివృద్ధిలో స్థిరత్వం ఉండాలంటే ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని చెప్పారు. ముందుగానే ప్రణాళికలు రూపొందించి, సమర్థవంతంగా అమలు చేస్తే మరింత ప్రగతి సాధించవచ్చని అన్నారు. భవిష్యత్తులో జిల్లా మరిన్ని రంగాల్లో ఆదర్శంగా నిలబడేలా చర్యలు కొనసాగుతాయని కలెక్టర్ తెలిపారు.
నీతి అయోగ్ ఆకాంక్షిత జిల్లాల అభివృద్ధిలో భాగంగా విద్య, ఆరోగ్యం, వైద్యం, వ్యవసాయం, మౌలిక వసతులు, సామాజిక సంక్షేమం వంటి ఆరు ముఖ్య సూచికలపై 100 శాతం అభివృద్ధి లక్ష్యంగా సంపూర్ణత అభియాన్ కార్యక్రమం చేపట్టారు. ఇందులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మూడు సూచికలపై శాతం సంపూర్ణత సాధించి రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అలాగే అంతేకాక, గుండాల మండలం బ్లాక్ స్థాయిలో ఐదు సూచికలను విజయవంతంగా పూర్తి చేసి ఆకాంక్షిత బ్లాక్‌లలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ క్రమంలో నీతి ఆయోగ్ అధికారి బృందాలు చేసిన సమీక్షల ఆధారంగా జిల్లా స్థాయిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను అవార్డు కోసం ఎంపిక చేశారు.