రుద్రంపూర్, జూలై 08 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రుద్రంపూర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ స్టేడియంలో బుధవారం నిర్వహించిన జిల్లా మిడిల్ అండ్ లాంగ్ డిస్టెన్స్ అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు ముగిశాయి. కొత్తగూడెం ఏరియా ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ ఎం.డి.రజాక్ జెండా ఊపి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎం.డి.రజాక్ మాట్లాడుతూ.. సింగరేణి కాలరీస్ సహకారంతో రుద్రంపూర్‌లో రెండు 400 మీటర్ల అథ్లెటిక్స్ ట్రాక్‌లను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. జిల్లా అథ్లెట్లు ఇప్పటికే జాతీయ స్థాయిలో పతకాలు సాధించి జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారని, అదే స్ఫూర్తితో రాష్ట్రస్థాయి పోటీల్లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబర్చి జిల్లాకు మరింత కీర్తి తీసుకురావాలని ఆకాంక్షించారు.
జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ.. జిల్లా నలుమూలల నుంచి సుమారు 150 మంది అథ్లెట్లు ఎంపిక పోటీల్లో పాల్గొన్నారని తెలిపారు. వీరిలో ప్రతిభ కనబరిచిన 40 మంది అథ్లెట్లను ఈ నెల 18న మెదక్‌లో జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు. కేటీపీఎస్ ఏడీఈ (TJLSS) తోకల రామదాస్ మాట్లాడుతూ, జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్‌కు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ట్రెజరర్ బి. హనుమంతరావు ఆధ్వర్యంలో జిల్లా అథ్లెటిక్స్ కోచ్ పి.నాగేందర్, కోచ్‌లు ఎల్.ప్రసాద్, నాగరాజు, పవన్, పీఈటీలు విజయ, విజయలక్ష్మి, రాకేష్‌లు ఎంపిక పోటీలను విజయవంతంగా నిర్వహించారు.

ముగిసిన భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా అథ్లెటిక్స్ ఎంపికలు