షాద్‌నగర్, జూలై 26 : కర్ణాటక ప్రభుత్వం కృష్ణ, భీమా నదులపై నిర్మిస్తున్న అక్రమ చెక్‌డ్యాంలు, బ్యారేజీలు, రిజర్వాయర్లను మాజీ ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్, ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి ఆదివారం మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కర్ణాటక సర్కారు కృష్ణా, భీమా నదులపై అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులతో తెలంగాణకు రావాల్సిన నదీ జలాలకు తీవ్ర ఆటంకం కలుగుతున్నదన్నారు. హైడ్రాలిక్ గేట్లు ఏర్పాటు చేసి నీటి ప్రవాహాన్ని అడ్డుకోవడం ద్వారా తెలంగాణ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు.
ఆర్డీఎస్ పరిధిలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలు చేపడుతున్న అక్రమ ప్రాజెక్టుల కారణంగా తుంగభద్ర జలాలు తెలంగాణ వైపు రావడం లేదని, ఇప్పటికే నీటి కొరతతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కర్ణాటక నుంచి నీటి ప్రవాహం నిలిచిపోతే రానున్న యాసంగి సీజనల్లో తెలంగాణ రైతులు పంటలు సాగు చేసుకునే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందన్నారు. తెలంగాణ రైతులకు జరుగుతున్న నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి కర్ణాటకలో నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులపై చర్యలు తీసుకునేలా కేంద్ర సర్కారుపై ఒత్తిడి చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు సాగు నీరందించే వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని వారు హెచ్చరించారు.