రఘునాథపాలెం, జూలై 26 : చేపల వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న మత్స్యకారులకు ఆర్థిక చేయూతను అందించాలనే ఉద్దేశంతో గత కేసీఆర్ సర్కార్ ఉచిత చేపపిల్లల పంపిణీకి శ్రీకారం చుట్టింది. దాదాపు ఎనిమిదేండ్లు మత్స్యకారులకు నయా పైసా ఖర్చులేకుండా ప్రభుత్వమే చెరువుల్లో చేపపిల్లలను వదిలింది. ప్రతి ఏడాది ఏప్రిల్ నాటికి టెండర్ల ప్రక్రియను పూర్తిచేసి జూలై, ఆగస్టు మాసాల్లో చేపపిల్లలను పంపిణీ చేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి ఉచిత చేపపిల్లల పంపిణీ ప్రశ్నార్థకంగా మారింది. అధికారులు సైతం మత్స్యకారులకు సరైన సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఈసారి సైతం చేపపిల్లల పంపిణీపై నీలినీడలు కమ్ముకున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా వేలాది మత్స్యకార కుటుంబాలు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మత్స్యకారుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కలిగింది. ఎదిగిన చేపల విక్రయం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది కుటుంబాలకు ఉపాధి చేకూరింది. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగించేందుకు ఆపసోపాలు పడుతున్నది. రెండేళ్లుగా చేపపిల్లలను పంపిణీ చేసేందుకు నానా అవస్థలు పడుతోంది. చెరువులు, కుంటల్లో చేపపిల్లలను వదిలేందుకు ప్రతి ఏడాది ఏప్రిల్ నెలలో టెండర్ల ప్రక్రియను ప్రారంభించాల్సి ఉండగా, ఈ ఏడాది జూలై నెలాఖరుకు వచ్చినప్పటికీ ఇంకా ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాలేదు. టెండర్లు పిలువలేదు. దీంతో ఈ ఏడాది చేపపిల్లలను పంపిణీ చేస్తారా.. లేదా? అని మత్స్యకారులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు.
ఖమ్మం జిల్లాలో 880 చెరువులు, కుంటలు ఉన్నాయి. వాటిలో ప్రతి ఏటా 3.70 కోట్లకు పైగా చేపపిల్లలను వదులుతూ వస్తున్నారు. అవి పెరిగి పెద్దయ్యాక వాటిని విక్రయించి వేలాది మంది మత్స్యకారులు ఉపాధి పొందుతున్నారు. ఒక్క ఖమ్మం జిల్లాలోనే 220 మత్య్సకారుల సంఘాలు ఉన్నాయి. వాటిలో 16వేల మంది సభ్యులు ఉన్నారు. వీరంతా చేపల విక్రయంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారుల వద్దకు వెళ్లి అడిగినా ఫలితం లేకపోయింది.
జిల్లాలో ప్రతి ఏడాది అదునుదాటిన తరువాత చేపపిల్లలను పంపిణీ చేస్తున్నారు. వాటిలో ప్రధానంగా బొచ్చ, రౌట, మోస్, బంగారుతీగలను వదులుతున్నారు. కానీ సరైన సమయంలో వదలకపోవడంతో చేపపిల్లలు ఎదగడం లేదు. దీంతో తమకు మేలు జరగడం లేదని మత్స్యకారులు వాపోతున్నారు. ఆగస్టులోపు చెరువుల్లో చేపపిల్లలను వదిలితే బాగా ఎదుగుతాయని, అలాంటిది సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు పంపిణీ చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. అంతేకాక కాంట్రాక్టర్లు సైతం నాసిరకం చేపపిల్లలను పంపిణీ చేస్తున్నారని, దీంతో అవి ఆశించిన మేర ఎదగడంలేదని ఆరోపిస్తున్నారు.
వర్షాలు లేకపోవడంతో జిల్లావ్యాప్తంగా చెరువులన్నీ ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. ఒక్క రఘునాథపాలెం మండలంలోనే సీతారామ ప్రాజెక్టు ద్వారా వచ్చిన గోదావరి జలాలు ఖమ్మానికి చేరుకొని మంచుకొండ ఎత్తిపోతల పథకం ద్వారా మండలంలోని చెరువులకు చేరడంతో కళకళలాడుతున్నాయి. ఇక మిగిలిన అన్ని మండలాల్లో ఎల్నినో, తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా చెరువులన్నీ గుర్రపుడెక్క పేరుకపోయి నీళ్లు లేక వెలవెలబోయి కనిపిస్తున్నాయి.
దీంతో ఈ ఏడాది చెరువుల్లో ఉచిత చేపపిల్లల పంపిణీ ప్రశ్నార్థకమే అన్నట్లుగా ఉంది. దీనికితోడు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు చేపపిల్లల పంపిణీపై కనీసం సమీక్షలు నిర్వహించకపోవడంతో ఈ ఏడాది చేపపిల్లల పంపిణీ లేనట్లే అనే అనుమానాలను మత్స్య సహకార సంఘాల నుంచి వినిపిస్తున్నాయి.