హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని గౌడ సమాజం ఆర్థికాభివృద్ధి, సంప్రదాయ తాటి వృత్తికి పునరుజ్జీవం కల్పించాలనే మహోన్నత లక్ష్యంతో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నీరా కేఫ్ కాంగ్రెస్ పాలనలో నిర్లక్ష్యానికి గురైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు సందర్శకులతో కళకళలాడిన ఈ కేఫ్, ఇప్పుడు మూతపడగా.. కోట్ల రూపాయలతో ఏర్పాటుచేసిన సామగ్రి తుప్పుపడుతున్నది. కేఫ్ పరిసరాలు, అతిథి గదులు అస్తవ్యస్తంగా మారడంతో గౌడన్న ఆత్మగౌరవ ప్రతీక అయి న నీరా కేఫ్ కాంగ్రెస్ పాలకుల నిర్లక్ష్యపు నీడన కునారిల్లుతున్నది. నాడు బీఆర్ఎస్ సర్కార్ నీరాను ఆరోగ్యకరమైన సహజ పానీయంగా దేశవ్యాప్తంగా గుర్తింపు తేవాలనే ఉద్దేశంతో ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా వద్ద కేఫ్‌ను ఏర్పాటుచేసింది. 2022లో అప్పటి మంత్రు లు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్ చేతుల మీదుగా ఈ కేఫ్‌ను ప్రారంభించారు. కేఫ్‌లో నీరాతోపాటు నీరాతో తయారుచేసిన ఐస్‌క్రీమ్‌లు, కూల్‌డ్రింక్స్, స్వీట్లు, తాటి ఆధారిత ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొచ్చారు.
నీరా కేఫ్ ఏర్పాటుతోపాటు కోట్ల రూపాయలతో శీతలీకరణ వ్యవస్థలు, స్టోరేజీ సదుపాయాలు, ఆధునిక కిచెన్, విక్రయ కేంద్రా లు, వినియోగదారులు కూర్చునే ఏర్పాట్లు, కార్యాలయ గదులు, శిక్షణ కేంద్రాలు, అతిథి గదులు వంటి మౌలిక వసతులు కల్పించారు. విక్రయ కేంద్రానికే పరిమితం కాకుండా, జిల్లాలవారీగా తాటిచెట్ల నుంచి నీరా సేకరణకు ఏర్పాట్లుచేశారు. గౌడసంఘాలకు శిక్షణ, ఫుడ్‌గ్రేడ్ సేకరణ పాత్రలు, చిల్లింగ్ సెంటర్లు, కోల్డ్‌చైన్ రవాణా వ్యవస్థ, పరీక్ష ప్రయోగశాలలు, శీతలీకరణ కేంద్రాలు ఏర్పాటుచేశారు.
నీరా ను శాస్త్రీయం గా ప్రాసెస్ చేసేందుకు నల్లగొండ (సర్వేల్), యాదాద్రి (నందనం), రంగారెడ్డి (ముద్విన్), సంగారెడ్డి(మునిపల్లి) ప్రాంతా ల్లో రూ.8 కోట్లతో ప్రాసెసింగ్ కేంద్రాలకు ప్లాన్చేశారు. నందనంలో పూర్తిస్థాయిలో నీరా ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభించారు. ఉద యం సేకరించిన నీరాను గంటల వ్యవధిలోనే హైదరాబాద్ కేఫ్‌కు తరలించే విధానాన్ని అమలుచేశారు. ఒక్కో రోజు ‘నీరా నో స్టాక్’ బోర్డు లు సైతం పెట్టిన సందర్భాలూ ఉన్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే నీరా కేఫ్ ప్రతిష్ఠ మసకబారుతూ వచ్చింది. దానిని పట్టించుకోకపోవడం, అదే సమయంలో టెండర్ గడువు ముగియడంతో అప్పటికే ఉన్న నిర్వాహకులు కేఫ్‌ను ఖాళీ చేయాల్సివచ్చింది. ఇదే అదనుగా గౌడన్నలకు చెందిన కేఫ్‌ను ప్రైవేట్‌పరం చేసేందుకు కుట్రలు చేయడంతో.. ‘నమస్తే తెలంగాణ’ ఆ కుట్రను వెలుగులోకి తెచ్చింది. గౌడ సంఘా లు ఆందోళనతో కేఫ్‌ను టూరిజం నుంచి టాడీ కార్పొరేషన్‌కు కట్టబెట్టారు. ఆ తర్వాత టెండర్ల ప్రక్రియ చేపట్టినా కొలిక్కి రాలేదు. మళ్లీ టెండర్లు పిలువగా పూలన్బాగ్ సొసైటీ కేఫ్‌ను దక్కించుకున్నది. తాత్కాలిక అనుమతులతో కేఫ్‌ను ప్రారంభించగా.. అది కూడా కొలిక్కి రాలేదు.
నీరా కేఫ్ అస్తవ్యస్తంగా మారిన వైనంపై ‘నమస్తే తెలంగాణ’ పూలన్బాగ్ కల్లుగీత సొసైటీని సంప్రదించగా.. కేఫ్ నిర్వహణకు పూర్తిస్థాయి అనుమతులు రాలేదని తెలిపారు. అవి కూడా చివరి దశలో ఉన్నాయని, వచ్చే నెల మొదటివారంలో కేఫ్‌ను పునఃప్రారంభిస్తామని చెప్పారు.
నీరా కేఫ్‌ను విజయవంతం చేయడానికి నాడు ఎక్సైజ్ మంత్రిగా ఉన్న శ్రీనివాస్‌గౌడ్ ఓ బ్రాండ్ అంబాసిడర్లా మారి.. కేసీఆర్ ఆలోచన మేరకు విస్తృతంగా ప్రచారం కల్పించారు. ప్రస్తుతం ఎక్సైజ్ మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు.. అధికారంలోకి వచ్చి 32 నెలలైనా ఒక్కసారి కూడా కేఫ్ వైపు కన్నెత్తి చూడలేదు. బీసీ సంక్షేమ శాఖమంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్గౌడ్ది అదే తీరు. ప్రభుత్వ పెద్దలే కావాలని నిర్లక్ష్యం చేస్తుండటంతో కేఫ్‌లో ఏర్పాటుచేసిన రిఫ్రిజిరేషన్ యూనిట్లు, ఫుడ్ ప్రాసెసింగ్ పరికరాలు, ఫర్నిచర్, కిచెన్ సామగ్రి వినియోగం లేక తుప్పుపడుతున్నది. అతిథి గదులు, కార్యాలయ గదులు దుమ్ముతో నిండిపోగా, పరిసరాలు కలుపు మొకలతో అస్తవ్యస్తంగా దర్శనమిస్తున్నాయి.