– దక్షిణ అయోధ్య పై ప్రభుత్వానికి ఎందుకు ఇంత చిన్నచూపు..?
– మూడు రాష్ట్రాల సరిహద్దుల ప్రాంతమైన భద్రాచలానికి ఎస్డిపిఓ పోస్ట్ కి “డిమోషన్”..!
– ఇక పోస్టింగ్ కోసం రాజకీయ పైరవీలకు తెర లేచేనా..!?
Bhadrachalam | కొత్తగూడెం ప్రగతి మైదాన్, ఏప్రిల్ 28: ఏజెన్సీ జిల్లాగా పేరు ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కీలకమైన భద్రాచలం ప్రాంతానికి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (ఎస్డీపీఓ) పోస్టుని ఐపీఎస్ అధికారి హోదా నుంచి కుదిస్తూ డీఎస్పీకే పరిమితం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం శోచనీయం.
మూడు రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్న భద్రాచలం సబ్ డివిజన్ మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో అక్కడ ఐపీఎస్ అధికారి హోదాను గత ప్రభుత్వాలు కొనసాగిస్తూ వచ్చాయి. ఛత్తీస్గఢ్ – తెలంగాణ – ఆంధ్ర సరిహద్దులకు కేంద్రీకృతమై ఉన్న భద్రాచలం ప్రాంతంలో గతంలో డీఎస్పీ స్థాయి అధికారులు పనిచేసినప్పటికీ మావోయిస్టుల ప్రాబల్యం ఉందనే నేపథ్యంలో దాన్ని నిర్మూలించడం కోసమే కాకుండా ఆ ప్రాంతం టెంపుల్ సిటీ కావడంతో అక్కడ ఐపీఎస్ అధికారిని గత ప్రభుత్వాలు నియమిస్తూ వచ్చాయి.
అయితే ప్రస్తుతం మావోయిజం పూర్తిగా నిర్మూలించబడింది అనే సాకుతో ఆ ప్రాంతాన్ని డీఎస్పీ హోదాకే పరిమితం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల విమర్శలు వస్తున్నాయి. మూడు రాష్ట్రాల సరిహద్దుకి మాత్రమే కాకుండా భద్రగిరిపై కొలువైయున్న రాములవారి ఆలయంతో టెంపుల్ సిటీగా పేరుపొందిన ఐటీడీఏ కారిడార్ కు డీఎస్పీ స్థాయి అధికారిని నియమించడం వల్ల ఇక రాజకీయ పైరవీలకు తెరలేపినట్లు అవుతుందని పలువురు చర్చించుకుంటున్నారు.
ఇప్పటికే డీఎస్పీ నుంచి కింది స్థాయి అధికారులకు పోస్టింగ్ కావాలంటే ఎమ్మెల్యే “కన్సంట్” లెటర్ అవసరం ఉందనే విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ పోస్టింగ్ డీఎస్పీకి పరిమితం చేయడం వల్ల ఇక రాజకీయ జోక్యంతో గంజాయి, అక్రమ ఇసుక వంటి అక్రమ రవాణాలకు తెరతీసినట్లు అవుతుందని, శాంతిభద్రతల సమస్యలు సైతం పునరావృతం అవుతాయని పలువురు భావిస్తున్నారు.
అంతే కాకుండా దక్షిణ అయోధ్యగా పేరు ఉన్న భద్రాచలానికి డీఎస్పీ స్థాయి అధికారిని నియమించడం పట్ల ఆ ప్రాంతంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిన్నచూపు అవగతం అవుతుంది. భద్రాచలం ప్రాంతానికి ఐపీఎస్ స్థాయి అధికారినే ఎస్డీపీఓగా నియమించాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు సూచిస్తున్నారు. జిల్లాలో అతిపెద్ద సబ్ డివిజన్ గా ఉన్నటువంటి భద్రాచలం ప్రాంతం పర్యాటక ప్రాంతం కావడంతో నిత్యం అక్కడ వేల సంఖ్యలో భక్తులు, పర్యాటకులు, రవాణాల సౌకర్యాలకు అదుపు చేయాలంటే ఐపీఎస్ స్థాయి అధికారి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఇక్కడ ఎస్డీపీఓ స్థానంలో తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకొని ఐపీఎస్ అధికారిని కొనసాగించాలని ప్రజలు కోరుతున్నారు.