రామవరం, నవంబర్ 12 : తేనెటీగల పెంపకం ప్రకృతిని, పంటలను రక్షించే ఒక అద్భుతమైన ప్రక్రియ. తేనె అనేది ఆరోగ్యానికి మేలు చేసే సహజ ఆహార పదార్థం మాత్రమే కాకుండా, వ్యవసాయ పంటల దిగుబడి పెరగడానికి, పర్యావరణ సమతుల్యతకు కూడా తేనె టీగలు కీలకం. మహిళలు తమ ఇళ్ల వద్దే తేనె టీగల పెంపకం చేసి ఆదాయం పొందుతూ ఆర్థికంగా స్వావలంబన సాధించవచ్చు అని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలెం రాజు అన్నారు. బుధవారం గౌతమ్ కానీ ఓపెన్ కాస్ట్, వెంకటేష్ ఖని కోల్ మైన్ ప్రాజెక్ట్ ప్రభావిత గ్రామాల మహిళలకు అందించిన తేనె టీగల పెంపక ప్రాజెక్ట్ పురోభివృద్ధిని గరీంపేట్ గ్రామంలో తేనెటీగల పెంపక బాక్స్‌ల పర్యవేక్షణతో పాటు తేనె సేకరణ పద్ధతులపై ప్రాక్టికల్ డెమోను మనబ్ కళ్యాణ్ వెల్ఫేర్ సొసైటీ ట్రైనర్లు నిర్వహించారు. దీనిని జీఎం షాలెం రాజు, జిఎం (ఎన్విరాన్మెంట్) బి.సైదులు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సింగరేణి సంస్థ మేనేజింగ్ అండ్ డైరెక్టర్ ఎన్.బాలరాం మార్గదర్శకత్వంలో, CSR (కంపెనీ సోషల్ రెస్పాన్సిబిలిటీ) కార్యక్రమంలో భాగంగా మనబ్ కళ్యాణ్ వెల్ఫేర్ సొసైటీ (త్రిపుర) సహకారంతో ఈ తేనెటీగల పెంపకం శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
మొత్తం 100 మంది మహిళలు ఈ కార్యక్రమానికి దరఖాస్తు చేసుకుని మూడు రోజుల సమగ్ర శిక్షణ పొందారన్నారు. అనంతరం సీ అండ్ ఎండి చేతుల మీదుగా వారికి తేనె టీగల బాక్స్‌లు, అవసరమైన కిట్లను పంపిణీ చేశారు. శిక్షణ పొందిన మహిళలు తేనె సేకరణ సమయంలో తప్పనిసరిగా ముఖాన్ని మాస్క్, చేతులకు గ్లౌలు ధరించాలని సూచించారు. అదనంగా మనబ్ కళ్యాణ్ వెల్ఫేర్ బృందం రెండు సంవత్సరాల పాటు నిరంతర సాంకేతిక మార్గదర్శకత్వం అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిజిఎం (పర్సనల్) జి.వి.మోహన్ రావు, ఎస్ఓఎం (ఎన్విరాన్మెంట్) టి. సత్యనారాయణ, మేనేజర్ (ఫారెస్ట్రీ) రమణారెడ్డి, మేనేజర్ (ఫారెస్ట్) డేవిడ్ అభిలాష్, డివై పిఎం జి.హరీశ్, మనబ్ కళ్యాణ్ వెల్ఫేర్ సొసైటీ ట్రైనర్లు, మహిళా లబ్ధిదారులు పాల్గొన్నారు.

Ramavaram : తేనెటీగల పెంపకం – మహిళా సాధికారతకు సుస్థిర మార్గం : జీఎం శాలెం రాజు